kichha Sudeep vs Ajay Devgn: ఇద్దరు సినీ హీరోల మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా తయారవుతోంది. ట్విట్టర్ వేదికగా మొదలైన విభేదాల పర్వంలోకి మరికొందరు సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ నాయకులు కూడా ఎంటరయ్యారు. అయితే, ఇందులో ట్విస్ట్ ఏంటంటే పార్టీలకతీతంగా నేతలందరూ ఒకే స్వరం వినిపిస్తున్నారు. ఇప్పుడీ అంశం దక్షిణాదిలో హాట్‌టాపిక్‌గా మారింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, కన్నడ హీరో కిచ్చ సుదీప్ మధ్య ట్విట్టర్లో వార్ నడుస్తోంది. సినిమాల అనువాదం, భాషల ప్రాధాన్యత విషయంలో ఇద్దరి మధ్యా రగడ కొనసాగుతోంది. అయితే, అది వాళ్లిద్దరి మధ్య వాగ్వాదంగా కాకుండా.. జనరల్ టర్న్ తీసుకుంది. దీంతో, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. హిందీ ఆధారిత నేతలు, సినీ తారలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఓ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో సుదీప్ చేసిన ప్రసంగంతో ఈ వివాదానికి బీజం పడింది. పాన్ ఇండియా స్థాయిలో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి అత్యుత్తమ సినిమాలు వస్తున్నాయని కొందరు అంటున్నారన్న సుదీప్.. అది నిజం కాదని కొట్టిపారేశారు. పాన్ ఇండియా స్థాయిలో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను అలరించే రీతిలో అంతర్జాతీయ స్థాయిలో కన్నడలో సినిమాలు వస్తున్నాయని అన్నారు. ఇకపై హిందీ మనకు జాతీయ భాష కాదని, హిందీ వాళ్లే పాన్ఇండియా స్థాయిలో ఇప్పుడు సినిమాలు తీస్తున్నారని, వాళ్ల సినిమాలను తెలుగు, తమిళ, కన్నడ వంటి దక్షిణాది భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారని, అయినా, వాళ్లు అవసరమైన విజయం అందుకోలేకపోతున్నారని సుదీప్ వ్యాఖ్యానించారు.
సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో తనదైన శైలిలో స్పందించారు. హిందీ జాతీయ భాష కాకుంటే.. మీ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. జాతీయ భాషగా ఎప్పటి నుంచో హిందీ కొనసాగుతోందని, ఎప్పటికీ అది ఉంటుందని ట్వీట్ చేశారు.
అజయ్ దేవగణ్ ట్వీట్‌కు కిచ్చా సుదీప్ రియాక్ట్ అయ్యారు. తాను ఎవరినీ కించపరిచేందుకు అలా మాట్లాడలేదని, నేను చేసిన వ్యాఖ్యలు మరో రకంగా అర్థం చేసుకున్నారని అజయ్‌ను ఉద్దేశించి సుదీప్ రిప్లై ఇచ్చారు. దేశంలోని భాషలన్నింటి మీదా తనకు గౌరవం ఉందన్న సుదీప్.. మేము హిందీని గౌరవిస్తున్నామని, హిందీ నేర్చుకున్నందుకే.. మీరు హిందీలో చేసిన ట్వీట్‌ను చదవగలిగానన్నారు. అదే తాను కన్నడలో సమాధానం ఇస్తే.. మీ పరిస్థితి ఏంటని, కన్నడ చదవ గలరా ? అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా.. ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకోకుండా స్పందిస్తే ఇలాగే జరుగుతుందని సుదీప్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ట్విట్టర్లో సాగుతున్న ఈ స్టార్ వార్ మధ్యలోకి సంచలన డైరెక్టర్ ఆర్జీవీ ఎంటరయ్యారు. దక్షిణాది స్టార్స్‌పై ఉత్తరాది స్టార్స్ అసూయ పెంచుకుంటున్నారని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. దక్షిణాది చిత్రాలు ఇటీవలి కాలంగా చెప్పుకోదగిన వసూళ్లతో దూసుకెళ్తున్నాయని, అందుకే ఉత్తరాది నటులు అసూయతో ఉన్నారని ఆర్జీవీ ట్వీట్ చేశారు. వరుస ట్వీట్లతో ఎటాక్ చేశారు. కేజీఎఫ్-2 సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయని, 50 కోట్ల కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ సృష్టించిందని, అందుకే ఉత్తరాది నటులు అసూయ పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఇకముందు బాలీవుడ్ సినిమాల ఓపెనింగ్ కలెక్షన్లు ఎలా ఉంటాయో చూద్దామని ట్విట్టర్లో సవాల్ చేశారు. బాలీవుడ్లో బంగారం ఉందా? కన్నడలో బంగారం ఉందా? అనేది త్వరలోనే రన్‌వే 34 ఓపెనింగ్ కలెక్షన్లతో స్పష్టమవుతుందని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
అటు.. కర్నాటకలో ఈ పరిణామం ప్రకంపనలు సృష్టిస్తోంది. కర్నాటక రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. పార్టీలకు అతీతంగా సుదీప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. సీఎం బసవరాజ్ బొమ్మై సహా.. మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామి తదితరులు కూడా రెస్పాండ్ అయ్యారు. భాషల వల్లే రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న సీఎం బొమ్మై.. సుదీప్ వ్యాఖ్యలు సరైనవే అని, వాటిని అందరూ గౌరవించాలని అన్నారు. ఇక, మాజీ సీఎంలు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామి మాత్రం అజయ్ దేవగణ్‌పై ఘాటుగానే విమర్శలు చేశారు. హిందీ ఎప్పటికీ మనకు జాతీయ భాష కాబోదని, దేశంలోని భాషా వైవిధ్యాన్ని గుర్తించడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని తాను కన్నడ ప్రాంతం వాడిని అయినందుకు గర్విస్తున్నానని, సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
ఇక, హెచ్డి కుమారస్వామి అయితే డోసు మరింత పెంచారు. హిందీ ఆధారిత పార్టీలు మొదటినుంచీ ప్రాంతీయ భాషలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, బీజేపీ హిందీ జాతీయ వాదాన్ని ప్రస్ఫుటించేలా అజయ్ దేవగణ్ ట్వీట్ చేశారని మండిపడ్డారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్.. కూడా సుదీప్‌కు మద్దతుగా నిలిచారు. దేశంపై అందరి ప్రేమ ప్రతి భాషలోనూ ఒకేలా అనిపిస్తుందని, ఒక భాషపై మరో భాష ఆధిపత్యం చెలాయించకుండా కాంగ్రెస్ పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని శివకుమార్ పేర్కొన్నారు. ఈ పరిణామాలు ఉత్తరాది, దక్షిణాది తారల మధ్య అంతరం పెంచాయి. సినీ పరిశ్రమ అంటే కేవలం ఉత్తరాది వాళ్లేనా ? బాలీవుడేనా ? దక్షిణాది వాళ్ళకి విలువ లేదా? దక్షిణాది సినిమాలకు అంత సత్తా లేదా? అన్న అంశం నుంచి.. జాతీయ భాషవైపు చర్చ (Kichha Sudeep comments on Hindi language) టర్న్ తీసుకుంది.
Also read : Neha Shetty: మోడ్రెన్ డ్రెస్‌లో నేహా శెట్టి.. రాధిక అందాలకు ఫిదా అవ్వాల్సిందే!
Also read : Acharya Movie Tickets: ఇదేందయ్యో ఇది.. అక్కడ ఆచార్య సినిమాకు ఒకటే టికెట్ బుక్ అయిందట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook