"నాకు జీఎస్‌టీ అంటే తెలియదు. అసలు జీఎస్‌టీ ఎందుకు పనికివస్తుందో.. దాని వల్ల ప్రజలకు లాభం ఏమిటో కూడా నాకు తెలియదు. ఈ మాటలు నేను నిజాయితీతో చెబుతున్నాను" అన్నారు మధ్య ప్రదేశ్ రాష్ట్రమంత్రి ఓంప్రకాష్ ద్రువే. "కేవలం నాకు మాత్రమే కాదు.. నాకు తెలిసిన అనేకమంది చార్టెడ్ అకౌంటెంట్లు కూడా తమకు జీఎస్‌టీ అంటే ఏమిటో సరిగ్గా అర్థం కాలేదన్నారు. జనాలకు ప్రభుత్వంపై నమ్మకం కలగాలంటే జీఎస్‌టీ అంటే ఏమిటో వారికి అర్థమయ్యేలా వివరించాలి. అయితే నాకు జీఎస్‌టీ అంటే సరిగ్గా తెలియదు కాబట్టి, నేను ఆ విషయంపై ఎక్కువగా మాట్లాడను" అని కూడా మంత్రి తెలిపారు. ఓంప్రకాష్ ద్రువే ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్‌లో ఆహార పౌరసంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. జీఎస్‌టీని ప్రభుత్వం ప్రవేశబెట్టి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.