నల్గొండ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ (61) దుర్మరణం పాలయ్యారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.
1956 సెప్టెంబర్ 2న నందమూరి తారకరామారావు, బసవతారకం నాలుగో సంతానంగా హరికృష్ణ నిమ్మకూరులో జన్మించారు. 1967లో 'శ్రీకృష్ణావతారం' లో బాలనటుడిగా తొలిసారి తెరపై కనిపించారు. ‘తల్లా పెళ్లామా’, ‘రామ్ రహీమ్’, 'దానవీర శూరకర్ణ', 'శ్రీరాములయ్య', 'సీతారామరాజు', ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘శివరామరాజు’, 'సీతయ్య', 'టైగర్ హరిశ్చంద్రప్రసాద్', 'స్వామి', ‘శ్రావణమాసం’ వంటి సినిమాల్లో నటించారు.
రాజకీయ ప్రస్థానం
తండ్రితో పాటు రాజకీయాల్లో ప్రవేశించిన హరికృష్ణ ఎన్టీఆర్ చైతన్య రథాన్ని స్వయంగా నడిపి క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగు దేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్లాక.. ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. మళ్లీ తెలుగుదేశంలో చేరారు. 1996-99మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రవాణా మంత్రిగా సేవలందించారు. టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా పనిచేసి సమైక్యాంధ్రకు మద్దతుగా రాజ్యసభలో తెలుగులో ప్రసంగించి.. విభజనను వ్యతిరేకిస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎంపీగా నిమ్మకూరులో రోడ్డు, సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏపీఆర్జెసి పునర్నిర్మాణం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటికీ కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.