న్యూఢిల్లీ: మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, బీజేపి అగ్రనేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం లైఫ్ సపోర్ట్‌పై జైట్లీ చికిత్స అందిస్తున్నట్టు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. జైట్లీ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపి అగ్రనేతలు ఎయిమ్స్‌కి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రైల్వేశాఖ మంత్రి పీయుష్ గోయల్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్థన్, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, బీజేపి ఎంపి రాజ్యవర్ధన్ రాథోడ్, బీజేపి ఎంపి మహేష్ శర్మ తదితర నేతలు ఎయిమ్స్‌కి వచ్చిన వారిలో ఉన్నారు.
జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా జైట్లీని చూసేందుకు వచ్చి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ బిరేందర్ సింగ్, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్వి కూడా ఎయిమ్స్‌కి వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇదిలావుంటే, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు శుక్రవారమే జైట్లీని పరామర్శించిన వారిలో ఉన్నారు.అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్తలు బీజేపి శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.