టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర మంత్రిగా ఉన్న నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై బీహార్‌లో ఓ కేసు నమోదైంది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ అక్కడే ఆ కార్యక్రమానికి హాజరైన పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాను హత్తుకోవడాన్ని తప్పుపడుతూ బీహార్‌కి చెందిన సుధీర్ ఓజా అనే న్యాయవాది ముజఫర్‌పూర్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అనునిత్యం సరిహద్దుల్లో పాక్ నుంచి భారత్‌లోకి చొరబాట్లకు సహకరిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్‌ని కౌగిలించుకుని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఇండియన్ ఆర్మీని, భారతీయులను కించపరిచేలా వ్యవహరించారని, అందుకే దేశద్రోహం నేరం కింద తాను ఈ కేసు పెట్టానని ఓజా తెలిపారు.
తన పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన కోర్టు.. వచ్చే వారం విచారణ చేపట్టనుందని స్పష్టంచేసినట్టు ఓజా మీడియాకు చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ని హత్తుకున్నందుకు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై బీజేపీ, అకాలి దళ్ పార్టీల నేతలు సైతం విరుచుకుపడుతున్నారు. సిద్ధూ పాకిస్తాన్ వెళ్లి మొదటి తప్పు చేస్తే, అక్కడ ఆ దేశ ఆర్మీ చీఫ్‌ని కౌగిలించుకుని మరో తప్పు చేశాడని పలువురు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.