సీబీఐలో కలకలం: సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!

సీబీఐలో కలకలం: సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!

Last Updated : Oct 22, 2018, 09:46 AM IST
సీబీఐలో కలకలం: సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరుపొందిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. సొంత ప్రత్యేక డైరెక్టర్‌పైనే కేసు నమోదు చేసింది. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్‌ ఆస్థానాపై సీబీఐ ఈ నెల 15న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఓ కేసు మాఫీ చేసేందుకు రూ.2 కోట్ల లంచం తీసుకున్నారని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఎఫ్‌ఐఆర్‌లో ఆస్థానాతో పాటు భారత గూఢచార సంస్థ ‘‘రా’’లోని ఉన్నతాధికారి పేరు కూడా ఉంది. ఆయన్ను ప్రస్తుతానికి నిందితుడిగా పేర్కొనలేదు.

ఆస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో.. ఆయన్ను విధుల నుంచి తప్పించేందుకు అనుమతివ్వాలని ప్రధాన మంత్రి కార్యాలయాన్ని(పీఎంఓ) సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ కోరారు.

మరోవైపు అలోక్‌ వర్మ తీరుపై ఆగస్టులో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి ఆస్థానా ఒక లేఖ రాశారు. కేసులో క్లీన్‌చిట్‌ కోసం వర్మ ముడుపులు తీసుకున్నారంటూ ఆ లేఖలో ఆరోపించారు.

అవినీతి కేసులను దర్యాప్తు చేసే సీబీఐ అధికారులే ఇలా ఓ అవినీతి కేసులో బుక్ అవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కాగా ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలతో మోదీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. తాజాగా ఈ సీబీఐ ముడుపుల వ్యవహారంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మరో షాక్ తగిలినట్లయింది.

అటు ఈ వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాలను బయట పెట్టాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

 

Trending News