'కరోనా వైరస్'ను ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఐతే లాక్ డౌన్ వేళ పేద ప్రజల సంగతేంటి..? వారు ఆకలితో అలమటించాల్సిందేనా..? ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వ పరిష్కారం చూపించింది.
పేద ప్రజలు ఎవరూ ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రోజు వారీ కూలీలు, పేద ప్రజల కోసం లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. వలస కూలీలు, పట్టణ కూలీలు, పేద వర్గాలకు ఈ ప్యాకేజీ కింద సాయం అందిస్తారు. ఈ ప్యాకేజీకి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకంగా పేరు పెట్టారు. దీని ద్వారా 80 కోట్ల మంది పేద ప్రజలను ఆదుకోనున్నారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న పేదలకు మరో మూడు నెలల వరకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
'లాక్ డౌన్'కు మద్దతిస్తాం..!!
'కరోనా వైరస్' రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి కూడా ఒక్కొక్కరికి 50లక్షల రూపాయల చొప్పున బీమా అందించనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా 8.9 కోట్ల మంది రైతులకు 2 వేల రూపాయలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల 50 లక్షల మహిళలకు జనధన్ అకౌంట్ల ద్వారా నెలకు 500 రూపాయల చొప్పున 3 నెలల వరకు ఇవ్వనున్నట్లు చెప్పారు. వారు సాఫీగా కుటుంబాన్ని సాగించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అలాగే పేద వృద్ధులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ తోపాటు అదనంగా మరో వెయ్యి రూపాయలు అందిస్తామన్నారు. అంతే కాదు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న వారి వేతనాన్ని రోజుకు 202 రూపాయలు పెంచారు.
దేశంలోని 80 కోట్ల పేద ప్రజలకు ఇప్పుడిస్తున్న రేషన్ తోపాటు అదనంగా 5 కేజీల బియ్యం లేదా గోధుమలు మరో 3 నెలల వరకు ఉచితంగా అందిస్తారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..