జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఈ రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవడానికి కోల్కతాకి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా తమతో కలిసి రావాలని ఆయన కోరారు. "మేము మమతాజీని దేశ రాజధానికి తీసుకొని వెళ్తాం. బెంగాల్లో చేసిన అభివృద్ధి ఆమె దేశం మొత్తం చేయాలని కోరుకుంటున్నాం" అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
ఈ రోజు మమతా బెనర్జీని కలిసి ఒమర్ అబ్దుల్లా తన ఆలోచనలను పంచుకున్నారు. జమ్ము కాశ్మీర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మమత మంచి సలహాలు ఇస్తున్నారని.. వాటిని తాము స్వాగతిస్తున్నామని ఒమర్ అబ్దుల్లా అన్నారు. దేశంలో మైనారిటీలకు పొంచిన ఉన్న ముప్పు గురించి తమకు ఆందోళనగా ఉందని.. ఈ క్రమంలో మమతా బెనర్జీ వంటి నాయకులు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయాలని ఆయన తెలిపారు.
మమతా బెనర్జీ కూడా ఈ సందర్భంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశం సిగ్గుపడేలా మోదీ సర్కార్ ప్రవర్తిస్తోందని ఆమె తెలిపారు. 2019 ఎన్నికలలో బీజేపీ వ్యతిరేక కూటమి గెలిస్తేనే.. అసలైన ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందని అన్నారు. అలాగే జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పై కూడా మమతా బెనర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మంచి నాయకుడిగా పేరు తెచ్చుకోవాలని.. దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఎదగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.