న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు సమ్మె సైరన్ మోగించాయి. ఈ నెల 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. 26, 27 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండగా, ఆ మరుసటి రోజైన 28నాడు నాలుగవ శనివారం కావడం, ఆ తర్వాత వెంటనే ఆదివారం సెలవు దినం కావడంతో వరుసగా 4 రోజులపాటు సమ్మెలో పాల్గొంటున్న బ్యాంకుల సేవలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. 10 ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగు బ్యాంకుల్లో విలీనం చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్(ఏఐబీఓసి), ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఐబిఓఏ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్(ఐఎన్బిఓసి), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్ఓబిఓ) ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులకు చెందిన సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. బ్యాంకుల విలీన నిర్ణయాన్ని విరమించుకోవడంతోపాటు బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా చేపడుతున్న సంస్కరణలకు ఇకనైనా స్వస్తి పలకాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా తమ డిమాండ్ల చిట్టాను ప్రభుత్వం ముందుంచిన ఉద్యోగ సంఘాల నేతలు.. మొండి బకాయిలను వసూలు చేయాలని, రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఖాతాదారులను సర్వీస్ చార్జీల పేరుతో తలకుమించిన భారం మోపొద్దని, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు రేకెత్తించొద్దని విజ్ఞప్తిచేశారు. రెండు రోజుల సమ్మె కారణంగా 48వేల కోట్ల రూపాయల లావాదేవీలపై ప్రభావం పడనుందని నేతలు తెలిపారు.
ఆగస్టు 30న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వివరాల ప్రకారం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ మూడూ కలిపి ఒక బ్యాంకుగా ఏర్పడనున్నాయి. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ రెండూ కలిపి ఒక గొడుగు కిందకు రానున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ ఒక బ్యాంకుగా ఏర్పడనున్నాయి. అలాగే ఇండియన్ బ్యాంకును అలహాబాద్ బ్యాంకులో విలీనం చేయనున్నట్టు కేంద్ర మంత్రి చేసిన ప్రకటన బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగుల్లో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు రేకెత్తడానికి కారణమైంది.