న్యూఢిల్లీ: మంగళవారం సుప్రీంకోర్టు ఆధార్ గడువును పొడిగించింది. ఆధార్ ను వివిధ సంక్షేమ పథకాలకు,సేవలకు తప్పనిసరి చేస్తూ కేంద్రం విధించిన గడువును అత్యున్నత న్యాయస్థానం మరోసారి పొడిగించింది.
ఆధార్ అనుసంధానంపై కేసును విచారిస్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ఐదురుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి గడుపు పెంపుపై నిర్ణయం తీసుకుంది.
మొబైల్ ఫోన్లు, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ అనుసంధానికి సంబంధించిన గడువును పొడిగించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వచ్చే వరకూ గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇదివరకు ఆధార్ అనుసంధానానికి మార్చి 31 చివరి గడువు ఉంది. కానీ కేంద్రం గడువును పొడిగించవచ్చు అని సంకేతాలు పంపింది. గత ఏడాది డిసెంబరు 15న వివిధ సేవలు, సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయాలన్న గడువును మార్చి 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు పొడిగించిన విషయం తెలిసిందే..!
మార్చి 7 వ తేదీన ఆధార్ చట్టంపై తన వాదనలను వినిపించిన సీనియర్ న్యాయవాది అరవింద్ దతర్, మార్చి 31వ తేదీన వరకు విధించిన ఆధార్ లింక్ గడువును పొడిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, రాయితీలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్ లింక్ గడువు మార్చి 31 వరకు కొనసాగుతుంది. ఇ-వాలెట్ సేవలతో ఆధార్ ను అనుసంధానించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28.