అమెరికాలో ఇద్దరు ప్రవాస భారతీయులపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. తుపాకీ కాల్పుల్లో పరంజిత్ సింగ్ (44) అనే వ్యక్తి మృతి చెందాడు. పార్థీ పటేల్ (30) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఆలస్యంగా వెలుగుచూసిన ఈ రెండు ఘటనలు మంగళవారం రెండు వేర్వేరు స్టోర్లలో జరిగాయి. జార్జియా రాష్ట్రంలోని ఫ్లాయిడ్ కౌంటీలో పదినిమిషాల వ్యవధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దుండగుడు తొలుత బర్నెట్ ఫెర్రీ రోడ్లోని హైటెక్ క్విక్ స్టాప్ వద్ద స్టోర్లో ప్రవేశించి అక్కడి కౌంటర్ వద్ద ఉన్న పరంజిత్ సింగ్ పై మూడు సార్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పరంజిత్ మృతి చెందాడు. ఆ తరువాత ఎల్మ్ స్ట్రీట్ ఫుడ్ అండ్ బెవరేజేస్ స్టోర్లోకి ప్రవేశించి డబ్బును దోచుకున్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న క్లర్క్ పార్థీ పటేల్ పై కాల్పులు జరిపాడని పోలీస్ అధికారులు తెలిపారు. దుండగుడిని రషద్ నికోల్సన్ (28) గా పోలీసులు గుర్తించారు. అతడు పాత నేరస్తుడే అని.. గతంలో పలు దొంగతనాల కేసుల్లో జైలుశిక్ష అనుభవించి విడుదలయ్యాడని పోలీసులు చెప్పారు.