Sabarimala: 40 రోజుల అకుంఠిత అయ్యప్ప మండల దీక్ష తర్వాత మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శించుకుంటే పుణ్యప్రదం అని భక్తులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఒక్కసారిగా అయ్యప్పలు పోటెత్తడంతో క్యూ లైన్లు కిలో మీటర్ల మేర ఉంది.
ఈ నెల 14న మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో జ్యోతిని దర్శించుకోవడానికి ఎక్కువ మంది భక్తులు కొండకు పోటెత్తారు. దీంతో క్యూ లైన్లు కొండవీటి చాంతాడంత పెరిగింది.
కొండపై భక్తుల తాకిడి పెరగడంతో అయ్యప్ప స్వామి దర్శానికి 12 గంటలకు పైగా సమయం పడుతుంది. అంతేకాదు అయ్యప్ప సన్నిధానం నుంచి పంబ వరకు భక్తులు క్యూ లైన్లలో నిలబడి స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.
రద్దీ నేపథ్యంలో కేవలం 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనం కల్పించారు. రేపటి నుంచి ఆన్ లైన్ దర్శనాలను కుదించారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేపటి నుంచి ఆన్ లైన్ దర్శనాలు పూర్తిగా కుదించారు. భోగి రోజున కేవలం 50 వేల మంది భక్తులకు అనుమతి ఇచ్చారు. మరోవైపు మకర సంక్రాంతి రోజైన 14న 40 వేల మందికి దర్శనం కల్పించనున్నారు.
ఈ నెల 15న 60 వేల మందికి ఆన్ లైన్ దర్శన సదుపాయం కల్పించనున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. మొత్తంగా అయ్యప్ప దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది భక్తులు శబరిమలకు వచ్చినట్టు కేరళ రాష్ట్రం తెలిపింది.