Famous Ganesh Temples: వినాయక చవితి సమీపిస్తోంది. ఈ ఏడాది గణేష్ చతుర్థి సెప్టెంబర్ 18వ తేదీన సోమవారం నాడు వస్తోంది. పండగ సోమవారం వస్తుండగా.. శని, ఆదివారాలు వీకెండ్ సెలవులు ఉన్న వాళ్లకు వరుసగా మొత్తం మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. అంటే ఇదొక లాంగ్ వీకెండ్ అన్నమాట. వినాయక చవితి నాడు వినాయకుడిని దర్శించుకుంటే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో దేశంలో విఘ్నేశ్వరుడు మూల విరాట్ గా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఏదైనా మీకు సమీపంలో, లేదా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఆ గణపతి దేవుడిని దర్శించుకోగలిగితే అంతకంటే భాగ్యం ఇంకేం ఉంటుంది చెప్పండి. అందుకే దేశంలో ప్రసిద్ధి గాంచిన మహా గణపతి పుణ్యక్షేత్రాల గురించి మీకు ఇక్కడ వివరాలు అందిస్తున్నాం. ఇప్పుడే కాదు.. జీవితంలో ఎప్పుడు వీలైనా ఓసారి దర్శించుకుంటే బాగుంటుంది అనేలా ఈ పుణ్యక్షేత్రాల నేపథ్యం ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం రండి.
ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్ :
ముంబైలోని సిద్ధి వినాయకుడి టెంపుల్ గురించి దాదాపు తెలియని వారు ఉండరు. ఇక్కడ గణపతిని దర్శనం చేసుకుంటే ఎలాంటి కోరికలైనా తీరుతాయి అని చెబుతుంటారు. సాధారణ జనం నుండి ప్రముఖుల వరకు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని నుండి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ వరకు అందరూ ఈ సిద్ధి వినాయకుడి భక్తులే.
చిత్తూరులోని కాణిపాకం మందిరం :
ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం గణపతి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. మహా గణపతి స్వయంభువుగా వెలిసిన అతి కొద్ది ఆలయాల్లో ఇది కూడా ఒకటి. దక్షిణ భారత్ లోనే కాకుండా ఉత్తరాది వారికి కూడా ఈ మందిరం సుపరిచితమే. ఇక్కడ విఘ్నేశ్వరుడు గర్భగుడిలో నడుం లోతు నీళ్లలో భక్తులను ఆశీర్వదిస్తూ దర్శనం ఇస్తుంటాడు.
కర్ణాటకలోని పరకాల మఠం :
మైసూరులోని పరకాల మఠంలోని గణపతి దేవాలయం కూడా చాలా ఫేమస్. ఈ గుడి నిర్మించిన తీరు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. పరకాల మఠంలోని గణపతి దేవుడిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుండో మైసూరుకు తరలివస్తుంటారు.
మధ్యప్రదేశ్లోని ఖజురాహో :
మధ్యప్రదేశ్లోని ఖజురాహోలో ఉన్న ఆలయాల్లో గణపతి దేవాలయం కూడా ఒకటి. ఇక్కడ కొన్ని పదుల ఎకరాల విస్తీర్ణంలో అనేక ఆలయాలు నిర్మించి ఉన్నాయి. ఈ ఆలయాలకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయాల్లో గణపతి దేవాలయం కూడా ఫేమస్.
పూణెలోని శ్రీమంత్ దగ్దుషేత్ గణపతి :
ఇండియాలో పేరున్న గణపతి పుణ్యక్షేత్రాల్లో పూణెలోని శ్రీమంత్ దగ్దుషేత్ గణపతి మందిరం కూడా ఒకటి. పూణెలోని సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉన్న ఈ దేవాలయానికి కూడా ఎంతో చరిత్ర ఉందని అక్కడి భక్తులు చెబుతుంటారు.
కర్పాగ వినాయగర్ టెంపుల్ :
తమిళనాడులోని శివగంగాయి జిల్లాలోని పిల్లయార్పట్టిలో కొలువైన కర్పాగ వినాయగర్ టెంపుల్ కూడా ప్రసిద్ధి గాంచిన గణపతి పుణ్యక్షేత్రాల్లో ఒకటి. శిలపై చెక్కిన వినాయకుడి విగ్రహం ఇక్కడి శిల్ప సంపదకు, ఆలయం ప్రాచీన కాలం నాటి కట్టడాలకు ఆనవాళ్లుగా నిలిచాయి.
హంపిలోని గణపతి మందిరం :
కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హంపిలో కొలువైన విఘ్నేశ్వరుడి మందిరం చూసి తీరాల్సిందే. హంపి అంటేనే శిల్ప సంపదకు పెట్టింది పేరు. ఇక్కడి వినాయకుడి విగ్రహం కూడా శిలపై చెక్కి ఉంటుంది. 14వ శతాబ్ధంలో విజయనగర రాజ్యానికి హంపి రాజధానిగా ఉండేది. అప్పటి నుండే ఇక్కడ వినాయక మందిరం అశేష జనాధరణతో విరాజిల్లుతోంది.
పుదుచ్చెరిలోని మనకుల వినాయగర్ టెంపుల్ :
దేశంలోనే పేరున్న గణపతి మందిరాల్లో పుదుచ్చెరిలోని మనకుల వినాయగర్ టెంపుల్ కూడా ఒకటి.
ముంబైలోని లాల్ బగుచా మందిరంలోని వినాయకుడికి కూడా భక్తుల కోరికలు తీర్చే మహా గణపతిగా పేరుంది. గణేశ్ చతుర్ధి వేడుకల్లో ఇక్కడ నిలిపే ఎత్తైన విగ్రహమే ముంబై వినాయక చవితి వేడుకలకు ప్రత్యేకతను తీసుకొస్తుంది.