టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి ఈషా గుప్తా స్పందించారు. పాండ్యాను పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఈషా తెలిపారు. 'నేను, పాండ్యా చాలా కాలంగా స్నేహితులం. మేమిద్దరం కలిసి డిన్నర్ కి వెళ్లడం వాస్తవమే కానీ.. డేటింగ్, పెళ్లి చేసుకోవడం లాంటి పుకార్లను ప్రచారం చేయకండి. మాకు అలాంటి ఉద్దేశం లేదు' అని ఆమె పేర్కొన్నారు. అటువంటి వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
అంతకు ముందు.. హర్దిక్ పాండ్యా, ఈషా గుప్తా త్వరలో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. డేటింగ్లో ఉన్నట్లు కూడా వార్తలు హల్చల్ చేశాయి. ఈ క్రమంలో నటి ఈషా గుప్తా స్పందించి.. అలాంటి గాలి వార్తలను నమ్మొద్దని చెప్పారు.
కాగా గతంలో నటి ఊర్వశి రౌతేలా కూడా పాండ్యా విషయంలో ఇలానే స్పందించింది. ఐపీఎల్-11 సమయంలో హార్ధిక్-ఊర్వశి రౌతెలా ఫొటోలు నెట్లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు స్వీడన్ మోడల్-నటి ఎల్లి అవ్రామ్తో పాండ్యా డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. గతంలో ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి వెళ్లినప్పుడు కెమెరా కంటికి చిక్కారు. ఆ ఫొటోలు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇక హర్దిక్ పాండ్యా విషయానికి వస్తే... ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది.