బర్మింగ్హామ్: భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతున్న మైదానంలో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మైదానానికి వచ్చారు. భారీ సెక్యూరిటీతో మైదానంలోకి అడుగుపెట్టినవారు ..ఒకరికొకరు ఎదురుపడ్డాక కరాచాలనం చేసి అభిమానులకు కనువిందు చేశారు..నమ్మశక్యంగా లేదు కదూ.. అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది...
భారత్-ఇంగ్లాండ్ దేశాల మధ్య శుక్రవారం మూడో రోజు ఆట ప్రారంభమైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కిమ్ వేషధారణలోని వ్యక్తి చేతిలో క్షిపణి పట్టుకుని వచ్చి మరీ అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. మరోవైపు మరో వ్యక్తి ట్రంప్ వేషధారణలో వచ్చి అందరినీ అబ్బురపరిచాడు. అభిమానులతో సరదాగా గడిపిన అనంతరం ఇరువురు ఎదురుపడి కరచాలనం చేసుకున్నారు.
ఈ దృశ్యాలన్ని మైదానంలోని తెరలపై కనిపించడంతో ఆటగాళ్లు, అభిమానులు కాసేపు నవ్వుకున్నారు. కామెంటేటర్లు ఆటను వదిలి వీరి వేషధారణలపై జోకులు పేల్చడం మొదలెట్టారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ‘కోహ్లీని చూసేందుకు కిమ్-ట్రంప్ వచ్చారు, కోహ్లీ బ్యాటింగ్ చూడ్డానికి వచ్చారా?’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.