విరాట్ కోహ్లీకి థ్యాంక్స్ చెప్పిన రోహిత్ శర్మ

తన అద్భుత ప్రదర్శనకు జట్టు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సహకారం ఎంతో ఉంది: రోహిత్ శర్మ

Last Updated : Oct 22, 2019, 05:12 PM IST
విరాట్ కోహ్లీకి థ్యాంక్స్ చెప్పిన రోహిత్ శర్మ

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా దిగడానికి సిద్ధమైనప్పుడు అతడి కెరీర్‌లో అదొక ప్రయోగంగా భావించారు టీమిండియా సీనియర్ క్రికెటర్స్. వీవీవీఎస్ లక్ష్మణ్ లాంటి ఆటగాళ్లయితే ఏకంగా ఓ అడుగు ముందుకేసి పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. అందుకు కారణం రోహిత్ శర్మపై ఇప్పటివరకు వన్డే ప్లేయర్‌గానే ముద్ర పడటమే. అయితే, తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ.. ఈ టెస్ట్ సిరీస్‌లో ఓపెనర్‌గా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 132.25 సగటుతో 529 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాను వన్డేలకే పరిమితం అనే ముద్రను తుడిచేస్తూ టెస్టుల్లోనూ చెలరేగిపోయాడు. 212 పరుగులతో ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ... 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. 

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తన అద్భుత ప్రదర్శనకు జట్టు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సహకారం ఎంతో ఉందని చెబుతూ వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ''ప్రపంచంలో ఎక్కడైనా కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు బ్యాట్స్‌మెన్‌ కొంత ఇబ్బందిగానే ఫీలవుతాడు. అయితే, ఈ సిరీస్‌లో మాత్రం నేను కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. భారీ స్కోర్లు సాధించాను. ఆరంభంలో క్రమశిక్షణతో నెమ్మదిగా, జాగ్రత్తగా ఆడాలని, క్రీజులో కుదురుకున్న తర్వాత భారీ షాట్లు కొట్టాలని నిర్ణయించుకున్నాను. ఇదంతా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, జట్టు యాజమాన్యం సహకారం వల్లే సాధ్యమైందని చెప్పిన రోహిత్ శర్మ... రాబోయే మ్యాచ్‌ల్లోనూ భారీ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తానని ధీమా వ్యక్తంచేశాడు.

Trending News