ఒలింపిక్స్ నుండి రష్యా బహిష్కరణ

2018లో దక్షిణ కొరియాలో జరిగే ఒలింపిక్ పోటీలకు రష్యా ప్రభుత్వం తమ క్రీడాకారులను పంపాల్సిన అవసరం లేదని.. ఆ వేడుకలో రష్యా జెండా ప్రదర్శన గానీ.. జాతీయ గీతం ఆలాపన గానీ వినిపించదని కమిటీ నిర్థారించింది. 

Last Updated : Dec 6, 2017, 04:57 PM IST
ఒలింపిక్స్ నుండి రష్యా బహిష్కరణ

2018లో జరిగే వింటర్ ఒలింపిక్స్ పోటీల్లో రష్యాపై నిషేధం విధించినట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రకటన జారీ చేసింది. తమ క్రీడాకారులకు నిషేధిత ఉత్ప్రేరకాలు, డ్రగ్స్ మొదలైనవాటిని రష్యా ప్రభుత్వమే సరఫరా చేస్తూ పోటీలకు పంపిస్తున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ ప్రకటించింది. 2018లో దక్షిణ కొరియాలో జరిగే ఒలింపిక్ పోటీలకు రష్యా ప్రభుత్వం తమ క్రీడాకారులను పంపాల్సిన అవసరం లేదని.. ఆ వేడుకలో రష్యా జెండా ప్రదర్శన గానీ.. జాతీయ గీతం ఆలాపన గానీ వినిపించదని కమిటీ నిర్థారించింది. 2014లో రష్యాలోని సోచిలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ తర్వాత అనేకసార్లు రష్యా క్రీడాకారులు డోపింగ్ టెస్టులో విఫలయమయ్యారని.. ఈ విషయమై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా ప్రభుత్వమే క్రీడాకారులకు డ్రగ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తుందన్న విషయం బయటపడిందని కమిటీ తెలిపింది. 

ఇలాంటి విషయాలు క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కనుక ఇక రష్యాను ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఐఓసీ ప్రకటించింది. 17 నెలల పాటు రష్యాను బహిష్కరించడానికి ఐఓసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఎవరైనా రష్యన్ అథ్లెట్ స్వచ్ఛందంగా వచ్చి, డోపింగ్‌కు ఎప్పుడూ పాల్పడలేదని రాతపూర్వకంగా స్టేట్‌మెంట్ ఇచ్చి, పోటీలో పాల్గొంటే తమకు అభ్యంతరం లేదని కమిటీ తెలియజేసింది. అలాంటి ప్రత్యేక అథ్లెట్లను ‘ఒలింపిక్ అథ్లెట్స్ ఫ్రం రష్యా’ పేరుతో వ్యవహరిస్తామని.. వారిపై నిఘా పెంచుతామని.. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా)  వారికి పరీక్షలు నిర్వహిస్తుందని ఐఓసీ తెలియజేసింది.

Trending News