Telangana Politics: నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్‌కు కంచుకోట..! కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కంచుకోట బీటలు వారాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఘన విజయం సాధించారు. దాంతో ఇన్నాళ్లు బోధన్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని అధికారం చెలాయించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ పత్తాలేకుండా పోయారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 60 కోట్లు ముంచిన ఆయన్ను పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్‌లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. దాంతో బోధన్ నియోజకవర్గంలో షకీల్ భార్య ఆయన లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రభుత్వానికి పంగనామాలు పెట్టేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి సేకరించిన ఆయన.. ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయకుండా విదేశాలకు తరలించి కోట్లాది రూపాయలు నొక్కేశారని ఆరోపణలు ఉన్నాయి. 2021 నుంచి 2023 వరకు వానాకాలం సీజన్లలో దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. షకీల్ రహేల్, రాస్, అమీర్, దాన్విక్ మిల్లుల ద్వారా ఈ ధాన్యాన్ని సేకరించారు. అయితే ఇలా సేకరించిన ధాన్యం మొత్తాన్ని మిల్లింగ్ చేయకుండా.. అక్రమ మార్గంలో ముంబాయి, కాకినాడ పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి చేసినట్టు సమాచారం. కేవలం 5 వేల మెట్రికల్ టన్నుల రీసైకిల్ బియ్యాన్ని మాత్రం పౌరసరఫరాల శాఖకు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మరో 10 వేల మెట్రికల్ టన్నుల ధాన్యాన్ని నాలుగు సంస్థలకు ఇచ్చినట్టు రికార్డుల్లో నమోదు చేయించారు. ఈ నాలుగు మిల్లుల యజమానులతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బలవంతంగా ధాన్యం తీసుకున్నట్టు లేఖలు ఇప్పించినట్టు తెలుస్తోంది.
ఇక రాష్ట్రంలో సర్కార్ మారిపోగానే.. షకీల్ అక్రమాలపై దృష్టి సారించింది. బోధన్ నియోజకవర్గంలో షకిల్ అక్రమాలపై రేవంత్ సర్కార్ కేసులు నమోదు చేసింది. అయితే ధాన్యం అక్రమాలపై విచారణ ముమ్మరం చేసిన అధికారులు.. 60 కోట్ల రూపాయల విలువైన ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో రేవంత్ సర్కార్ నాలుగు మిల్లుల యజమానులకు దాదాపు 10 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే ఇప్పటివరకు షకీల్ మాత్రం అటు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వలేదు.. ప్రభుత్వం విధించిన జరిమానాను కూడా చెల్లించలేదు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చినా స్పందన లేదని చెబుతున్నారు. దాంతో 41 మంది మిల్లర్లను ప్రభుత్వం డిఫాల్టర్లుగా ప్రకటించింది. ఈ మిల్లర్లు దాదాపు 417 కోట్ల రూపాయల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది.. ఇందులో షకీల్ నుంచి 60 కోట్ల రూపాయల బియ్యం సేకరించాల్సి ఉంది. కానీ ఈ కేసుల భయంతోనే షికీల్ దుబాయ్ పారిపోయినట్టు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్ నేతలకు మాజీ ఎమ్మెల్యే షకీల్ నిండా ముంచినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కీలక నేత చేత దుబాయ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టించారట. దుబాయ్‌లో హోటల్ బిజినెస్ బాగుందని అక్కడ వ్యాపారం చేయడం ద్వారా పదింతలు ఎక్కువ సంపాదించవచ్చని పెట్టుబడులు పెట్టించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సర్కార్ మారడం.. షకీల్ అక్రమాలు బయటకు రావడంతో ఆయన దుబాయ్ పారిపోయారు. అయితే అప్పటికే బినామీ ఆస్తులతో హోటల్ బిజినెస్ మొదలు పెట్టిన షకీల్ ఇప్పుడు ఆ వ్యాపారాలన్నీంటికీ తానే యాజమానిగా మారినట్టు తెలుస్తోంది. దాంతో వ్యాపారం కోసం డబ్బులు ఖర్చు పెట్టిన లీడర్ తల పట్టుకుంటున్నట్టు తెలిసింది. షకీల్‌ను తెలంగాణకు తీసుకురావాలని పార్టీ పెద్దలను సొంత పార్టీ లీడర్లే కోరుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి పెరగడంతో ఒకరిద్దరూ నేతలు షకీల్‌కు టచ్‌లోకి వెళ్లారట. అయితే ఇప్పట్లో తాను భారత్ వచ్చే ఆలోచనలో లేనని వారితో షకీల్ చెప్పారట. దాంతో షకీల్ పేరిట ఆస్తులు పోగేసిన లీడర్లు తెగ పరేషన్ అవుతున్నారట. మరోవైపు షకీల్ భారత్ తిరిగొచ్చే ఆలోచనలో లేనందుకే భార్యను పొలిటికల్‌గా యాక్టివ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పర్యటనకు రెగ్యులర్‌గా వెళ్తున్నారు. ఆమె నిజామాబాద్ వెళ్లిన ప్రతి మీటింగ్‌లో షకీల్ భార్య ఉంటుండటంతో సొంత పార్టీ లీడర్లే అవాక్కువుతున్నారట. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన షకీల్ భార్య కవిత వెంట ఎందుకు తిరుగుతున్నారని ఆరా తీస్తున్నారట. అయితే ఆమె కూడా రాజకీయంగా యాక్టివ్ అయ్యారని తెలుసుకుని షాక్ అవుతున్నారట.
మొత్తంగా షకీల్‌ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఖజానాకు దాదాపు 60 కోట్లు ముంచేసినా షకీల్‌ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట. మరోవైపు అధికారులు కూడా మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. మొత్తంమీద భారత్ తిరిగివస్తే.. కటాకటాలు తప్పవనే భయంతోనే షకీల్ రాష్ట్రానికి రావడం లేదని బోధన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.