Children Shock To Parents: పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని ఆ ఇద్దరు బుడతలు ఏకంగా తల్లిదండ్రులనే బురిడీ కొట్టించాలని చూశారు. అంత చిన్న వయసులో సొంతింటికే కన్నం వేశారు. లక్షల రూపాయల సొమ్ము కాజేసి విలాసాలకు ఎగబడ్డారు. ట్విస్ట్ ఏంటంటే కాజేసిన సొమ్ము స్థానంలో దొంగ నోట్లు పెట్టి.. ఇక తమ తల్లిదండ్రులు పసిగట్టలేరులే అని భావించారు. కానీ తల్లిదండ్రులకు ఆ ఇద్దరిపై ఎక్కడో తేడా కొట్టడంతో గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆ ఇద్దరు బుడతలు నిజం ఒప్పుకోక తప్పలేదు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం... జీడిమెట్ల పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్‌లో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో చదువుతున్నారు. ఇటీవల తమ తల్లిదండ్రులు ఇంట్లోని కబోర్డులో కొంత సొమ్ము భద్రపరచడాన్ని ఇద్దరు అన్నాదమ్ములు గమనించారు. ఇదే విషయాన్ని స్నేహితులతో చెప్తే... అందులో కొంత మొత్తాన్ని తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చునని చెప్పారు.
స్నేహితుల మాటలు విని ఆ ఇద్దరు అన్నాదమ్ములు అప్పుడో కొంత ఇప్పుడో కొంత అన్నట్లుగా.. ఇంట్లో నుంచి మొత్తం రూ.4 లక్షలు కాజేశారు. తల్లిదండ్రులకు అనుమానం రాకుండా... కాజేసిన నగదు స్థానంలో నకిలీ కరెన్సీ నోట్లు పెట్టారు. కాజేసిన డబ్బుతో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు కొనుగోలు చేశారు. స్నేహితులతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇదే క్రమంలో వారి తల్లిదండ్రులకు పిల్లల ప్రవర్తన ఎక్కడో తేడా కొట్టడం ప్రారంభించింది. ఉన్నట్టుండి తమ పిల్లలు చాలా లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడినట్లు అనిపించడంతో... విషయమేంటని మందలించారు. అదే సమయంలో ఇంట్లో డబ్బు కనిపించకపోవడంతో వారి అనుమానం మరింత బలపడింది.
పిల్లలద్దరినీ గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పేశారు. ఇంట్లోని నగదును తామే దొంగిలించినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ తిన్నారు. అయితే ఈ ఇద్దరికీ దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది మిస్టరీగా మారింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలకు దొంగ నోట్లు ఎవరిచ్చారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Also Read: Viral Video: కొన్నది సెకండ్ హ్యాండ్ సైకిలే కానీ.. బెంజ్ కారు కొన్న రేంజ్‌లో సంతోషం! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook