Telangana CM KCR about lockdown in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే విషయంలో గత అనుభవాలతో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. లాక్డౌన్ విధించడం వల్ల కొవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గడం సంగతి అటుంచితే, ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం రాత్రి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ (CM KCR review meeting) ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స, కొవిడ్-19 వ్యాక్సినేషన్, కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వలు, ఆక్సీజెన్ నిల్వలుపైనే ఈ సమీక్షా సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది.
తెలంగాణలో లాక్ డౌన్ విధించబోమని సీఎం శ్రీ కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని అన్నారు. గత అనుభవాలు, లౌక్ డౌన్ విధించినా ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు తగ్గకపోవడాన్ని సీఎం ఉదహరించారు. pic.twitter.com/7UG9sWXQku
— Telangana CMO (@TelanganaCMO) May 6, 2021
కేంద్రం నుండి రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్ సప్లై, రెమ్డెసివిర్ వ్యాక్సిన్లు, ఇతర వ్యాక్సిన్లు సరఫరాపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ ఫోన్లో (CM KCR to PM Modi over telephone) మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులోని పెరంబదూర్, కర్ణాటకలోని బళ్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ సప్లై సరిగ్గా అందడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దగ్గర్లోని ఆక్సీజన్ ప్లాంట్స్ నుంచి ఆక్సీజన్ సప్లైకి కేటాయింపులు జరిపితే మరింత సౌకర్యంగా ఉంటుందని కోరారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్న చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో కరోనా పేషెంట్స్ వస్తుండటం వల్ల వారికి అందించాల్సిన చికిత్స, సౌకర్యాలు, వ్యాక్సిన్స్, ఆక్సీజన్ సరఫరా (Oxygen supply) తదితర విషయాల్లో అదనపు భారం పెరిగిందని సీఎం కేసీఆర్ ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి రోజుకు ప్రస్తుతం 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే సరఫరా అవుతోందని, ఆ మొత్తాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా కోరారు.
రెమ్డెసివిర్ ఇంజక్షన్ల (remdesivir injections) విషయంలోనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రధాని మోదీకి తెలిపిన సీఎం కేసీఆర్.. ప్రస్తుతం 4,900 రెమిడెసివిర్ ఇంజక్షన్స్ మాత్రమే అందుతున్నాయని, రోగుల సంఖ్యతో పోల్చుకుంటే ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదని అన్నారు. ఆ కోటాను 25 వేలకు పెంచాలని ప్రధానిని కోరారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి 50 లక్షల డోసులను సరఫరా చేసిందన్నారు. రాష్ట్రంలో రోజుకు రెండు నుంచి 2.5 లక్షల డోసులు వరకు అవసరం ఉందని వివరించారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి అందాల్సిన సాయాన్ని తక్షణమే విడుదల చేయాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. ప్రధాని మోదీ (PM Modi) సైతం సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం.