Rahul Gandhi Speech in Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో భాగంగా గత 12 రోజులుగా తెలంగాణలో జోడో యాత్ర కొనసాగింది. సోమవారం భారత్ జోడో యాత్ర తెలంగాణలోంచి మహారాష్ట్రలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా తెలంగాణలో చివరి రోజు యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణను విడిచి వెళ్లడం కొంత బాధాకరంగా ఉందని అన్నారు. తెలంగాణలో ఎంతో మందిని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ కితాబిచ్చారు.
చేతులు, కాళ్ళు విరిగిన కార్యకర్తలు సైతం దేనికీ వెనుకడుగు వేయకుండా తమ పనిని కొనసాగించడం అభినందనీయం. మీరంతా ఏ కులానికో, మతానికో చెందినవారు కాదు.. అంతా భారతీయులే. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, చేనేత కార్మికులతో పాటు అన్ని వర్గాల వారిని కలిశాను. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని వారిని కలిసినప్పుడే నాకు అర్ధమైంది. దెబ్బలు తగిలినా పోరాడే తత్వం తెలంగాణ సమాజానిది. తెలంగాణ ప్రజల గొంతు వినాల్సిందే.. అణచివేయడం కుదరదు. ఇది దేశం మీ నుంచి నేర్చుకునే సందేశం అని చెబుతూ రాహుల్ గాంధీ తెలంగాణ సమాజాన్ని ఆకాశానికెత్తారు.
తెలంగాణలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జబ్బు చేస్తే ఒక పేదవాడు ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి ఉంది. తెలంగాణలో ప్రభుత్వాసుపత్రులు నిర్విర్యమయ్యాయి. పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలంటే లక్షల రూపాయలు గుప్పించాల్సిన పరిస్థితి. తెలంగాణలో కేసీఆర్ సర్కారు విద్యా వ్యవస్థను నాశనం చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే...
దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇందిరా గాంధీ లక్షలాది ఎకరాలు పంపిణీ చేయగా.. కేసీఆర్ సర్కారు ఆ భూములను లాక్కుంటోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారి భూములను వారికి తిరిగి ఇచ్చేస్తాం అని రాహుల్ గాంధీ హామి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తాం అని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. రైతులు పండించే అన్నిరకాల పంటలకు ప్రభుత్వం తరపు నుంచి మద్దతు ధరను కల్పిస్తాం అని మరోసారి పునరుద్ఘాటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. భూతగాదాలకు కారణం అవుతోన్న ధరణిని తొలగించడం జరుగుతుందని గతంలోనే రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.
కేసీఆర్, మోదీ పాలనలో...
ఈ ఇద్దరి పాలనలో ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రజల్లో భయాందోళనలు, విద్వేషం, హింస పెరిగిపోయాయి. ఇలాంటి వారి పాలనకు, దుశ్చర్యలకు వ్యతిరేకంగా తాను భారత్ జోడో యాత్ర చేపట్టాను అని భారత్ జోడో యాత్ర వెనుకున్న ఆంతర్యాన్ని రాహుల్ గాంధీ వివరించే ప్రయత్నం చేశారు.
I’ll remember every hug, every expression of love from the people of Telangana. Thank you ♥️
Our Yatra will carry forward your die-hard spirit - to fight injustice & protect harmony.🇮🇳 pic.twitter.com/KDc60SMJpZ
— Rahul Gandhi (@RahulGandhi) November 7, 2022
మోదీ, కేసీఆర్ కలిసి పని చేస్తున్నారు...
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కొంత మంది కార్పొరేట్ పెద్దలకు లాభం చేకూర్చేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోదీ సర్కారు ఏ చట్టం తీసుకొచ్చినా అందుకు కేసీఆర్ మద్దతు ఇస్తూ వస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పేదల సొమ్మును పెద్దలకు దోచి పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ వస్తోంటే.. మరోవైపు కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.