హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామాత్యులు మంత్రి కేటీఆర్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కేటీఆర్ పై విచారణకు ఆదేశించకుంటే తాను కోర్టుకు వెళతానని పేర్కొన్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో రూ.8 కోట్లుగా ఉన్న కేటీఆర్ ఆస్తి 2018 ఎన్నికల నాటికి రూ.41 కోట్లకు ఎలా పెరిగిందని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ విరాళాలు రూ.188 కోట్లకు పెరగటం వెనుక గల మతలబు ఏంటని ప్రశ్నించారు.
ఒకవైపు రాష్ట్రం మూడువేల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయి ఉంటే వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారంటూ, అవన్నీ ఎలా వచ్చాయంటూ నిలదీశారు. త్యాగాలతో తెలంగాణ వచ్చిందని.. వాటి భోగాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. 111 జీవో పరిధిలో బినామీ పేరుతో కేటీఆర్ రాజమహల్ నిర్మించారన్నారు. పుప్పాల గూడలో రూ.30 కోట్ల ఆస్తిని కోటి రూపాయలకే ఎలా కొన్నారని ప్రశ్నించారు. ఈ నేతల అవినీతిపై సమగ్ర వివరాలతో త్వరలో పుస్తక రూపంలో తీసుకువస్తానని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..