TRS complaint Against BJP: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం బీజేపి అవకతవకలకు పాల్పడుతోందని టీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ సాయంత్రం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారిని కలిసిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి , విద్య మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ అధ్యక్షులు రావుల శ్రీధర్ రెడ్డి, నల్లగొండ గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి.. బీజేపి నేతలు ఎన్నికల నియమావళి నిబంధనలను ఉల్లఘించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వారి కుటుంబసభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పోలీసుల అనుమతులు తీసుకోకుండా బీజేపి తరపున కుల సంఘాల పేరిట సమావేశాలు ఏర్పాటు చేసి ఓటర్లను మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి దేవాలయంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఎదుట ప్రమాణం చేసి దేవాలయాన్ని అపవిత్రం చేయడమే కాకుండా మునుగోడు ఓటర్లలో మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా ఓటర్లను టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేఖంగా మారేలా పార్టీపై దుష్ర్పచారం చేయడం, ఓటర్లను డబ్బుతో ప్రలోభాలకు గురిచేసేలా విచ్చల విడిగా డబ్బులు పంపిణి చేయడం కూడా జరుగుతోందన్నారు. ఇలా మొత్తం ఐదు అంశాలను తమ ఫిర్యాదులో ప్రముఖంగా ప్రస్తావించారు. అందుకు సంబంధించిన సిడిలు, డాక్యుమెంట్స్ జిల్లా ఎన్నికల అధికారి పరిశీలనార్థం తమ ఫిర్యాదుతో పాటే జత పరిచారు. తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని నిష్పక్షపాక్షికంగా విచారణ జరిపి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న వారిపై చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన జిల్లా ఎన్నికల అధికారి.. ఫిర్యాదుపై విచారణ జరిపించనున్నట్టు వారికి హామీ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారిని కలిసేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కలెక్టరేట్ వద్ద పొలిటికల్ హంగామా వాతావరణం కనిపించింది.