‘నా పేరు రాష్ట్రంలో తెలిసింది అంటే మీరు పెట్టిన రాజకీయ భిక్ష. నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత కార్మికుల బతుకులు బాగుపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు కారు గుర్తుకు కాక ఇంకెవరికి వేస్తారంటూ’ మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు.
‘కేవలం సిరిసిల్ల ప్రజలకు కాదు మున్సిపల్ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు చెబుతున్నా. 22నాడు టీఆర్ఎస్కు ఓటేయండి. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 75గజాలలోపు స్థలంలో ఎవరి పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకునేలా చేశాం. 75 గజాలు మించితే 21రోజుల్లో పర్మిషన్ ఇస్తున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీది, వారితో మీ పనులు చేపించే బాధ్యత నాది. పని చేయకపోతే ఆ టీఆర్ఎస్ నేతలను పీకిపారేస్తానని’ పార్టీ అభ్యర్థులను మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
‘కారు గుర్తుకు ఓటు కోసం వచ్చిన వాళ్లే మా నేతలు. గులాబీ జెండాలతో రెబెల్స్ వస్తున్నారు. కారు గుర్తుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవాళ్లు మా వాళ్లు ఎలా అవుతారు. ఇప్పటికైనా వెనక్కి వచ్చేయండి. నాలుగు ఎలక్షన్లలో నన్ను గెలిపించారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాట నమ్మరు. ఆసరా 42 లక్షల మంది కార్మికులకు రూ.2వేలు, రూ.3వేల పింఛన్లు అందిస్తున్నాం. కంటివెలుగు, కేసీఆర్ కిట్, రైతు బంధు, చేనేత లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి.. ఇలా మా పథకాల గురించి చెబుతూ పోతే తెల్లారిపోతుంది.
ఎలక్షన్ సమయంలో కులం, మతాల పేరు చెప్పితే ఆగం కావొద్దు. గాడిదలకు గడ్డేసి.. ఆవులకు పాలు పిండితే కుదరదు కదా. అందుకే టీఆర్ఎస్కు ఓటేస్తే మీకు కావల్సినవి చేస్తాం. కలెక్టరేట్, రింగ్ రోడ్డు, నీళ్ల మీద నుంచి రైలు వెళ్తే మీరు చూడాలి. అక్కాచెల్లెమ్మలకు రూ.12వేలు సంపాదించుకునేలా చూస్తాం. కొన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జనవరి 22న ఓటింగ్ జరిగే మిగతా 35 స్థానాల్లోనూ గెలిపించండి. అభివృద్ధి చేసే బాధ్యత నాది.
దేశంలోనే అగ్రగామిగా సిరిసిల్ల
రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సిరిసిల్లను అగ్రగామిగా తీర్చిదిద్దుతా. రాబోయే రెండేళ్లలో రెైలు తీసుకొస్తాను. హైదరాబాద్కు వెళ్లాలన్నా రైలు తీసుకొస్తం. గోదావరి నీళ్లు తీసుకొస్తామంటే నవ్వారు. కానీ ఈరోజు జరిగింది. ఏ అనుమానం వద్దు. పేదవాడు ఒక్కరికి కూడా మోసం జరగలేదు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇస్తాం. జేఎన్టీయూతో మాట్లాడి ఇంజినీరింగ్ కాలేజీ పెట్టిస్తాం. బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం తప్పు చేస్తే అధికారులను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశం ఉందని’ కేటీఆర్ వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..