మా రాయబారి రక్షణ బాధ్యత మీదే

  

Last Updated : Oct 23, 2017, 05:23 PM IST
మా రాయబారి రక్షణ బాధ్యత మీదే

పాకిస్తాన్‌లో అడుగుపెట్టబోతున్న తమ నూతన రాయబారి యావో జింగ్ రక్షణ బాధ్యతను ఆ దేశం తీసుకోవాలని చైనా ప్రభుత్వం కోరింది. ఇప్పటికే పాకిస్తాన్‌లోని  చైనా అంబాసిడర్ ఆఫీసు అధికారులపై హత్యాప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఆ దేశం ఈ మేరకు స్పందించింది.

ఈ విషయంమై పలు తీవ్రవాద గ్రూపులు చేస్తున్న ప్రకటనలను తాము కొట్టేయలేమని తెలిపింది. ఇటీవలే పాకిస్తాన్‌లో చైనా అంబాసిడర్‌గా వ్యవహరించిన సన్ వీడాంగ్ తన పదవీకాలం ముగియడంతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయారు.

కొత్త అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న యావో జింగ్‌ను మట్టుబెట్టడానికి ఇప్పటికే అబ్దుల్ వలీ అనే వ్యక్తి పాకిస్తాన్‌లోకి ప్రవేశించాడని, అతని పాస్‌పోర్టుని సీజ్ చేసి తనను వెంటనే చైనా ప్రభుత్వానికి అప్పగించమని చైనా ప్రభుత్వం కోరింది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు తమకు ఈ వార్త చేరిందని తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖకు చైనా ఎంబసీ ఉత్తరం రాసింది.

ప్రస్తుతం యావో జింగ్ ఇస్లామాబాద్‌లోని ఎంబసీ ఆఫీసులో తన విధులు నిర్వహించడానికి వస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో నిర్మితమయ్యే మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్టైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ (సీపీఈసీ) విషయంలో జింగ్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు.

చైనాలోని జింగ్జియాంగ్ ప్రాంతాన్ని, పాకిస్తాన్‌లోని గ్వాదర్ సముద్ర పోర్టుతో అనసంధానం చేసే ఈ కారిడర్ రోడ్డు, రైల్వే మార్గాలను కూడా కలుపుతుంది. 

 

Trending News