పాకిస్తాన్లో సామాజిక వ్యత్యాసాలు తలెత్తడంతో ఓ కుటుంబంలో పరువు హత్య చోటుచేసుకుంది. తమ కంటే తక్కువ ఆస్తి కలిగిన యువకుడిని ప్రేమించినందుకు కన్నకూతురితో పాటు.. ఆమె ప్రియుడిని కూడా తండ్రి హతమార్చాడు. ఈ హత్య చేసేందుకు నిందితుడి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. వివరాల్లోకి వెళితే... పాకిస్తాన్లోని అటోక్ జిల్లాలో ఆదివారం సాయంత్రం తన ప్రియురాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లిన యువకుడు.. ఆ ఇంటి యజమానికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. తర్వాత ప్రేమికులిద్దరూ.. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలిపారు.
అయితే ఆ విషయం తెలియగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఇంటి పెద్ద.. కుటుంబ సభ్యుల్ని పురిగొల్పి.. ఆ యువతీ, యువకులను తాళ్లతో బంధించాడు. తర్వాత వారిని కొట్టి.. వారి గొంతులను కోశాడు. అయితే అటోక్ జిల్లాలో పరువు హత్య జరిగిందనే విషయం దావానలంలా వ్యాపించడంతో.. పోలీసులు ఘటనా స్థలికి చేరి నిందితులలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి పై కేసులు కూడా నమోదు చేశారు.
ఈ కేసుల గురించి సాదర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆసిఫ్ ఖాన్ మాట్లాడుతూ.. నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని రికవర్ చేసుకున్నామని తెలిపారు. వారిని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో కూడా పరువు హత్యల సంఖ్య పెరుగుతోంది. పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం రికార్డుల ప్రకారం అక్టోబర్ 2016 నుండి జూన్ 2017 నెలల మధ్య 280 పరువు హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.