అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు (MPTC, ZPTC elections) నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20, 21న సెలవు దినాలుగా ప్రకటిస్తూ ఏపీ సర్కార్ (AP govt) ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికలు జరగడానికంటే 48 గంటలు ముందు నుంచే మద్యం దుకాణాలు మూసేలా అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ సూచించారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక చర్యల్లో పాల్గొనాల్సి ఉన్నందున క్షేత్రస్థాయిలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని స్థానిక సంస్థల ఎన్నికల విధులకు వినియోగించరాదని సీఎస్ నీలం సహాని జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులను ఆదేశాలు జారీచేశారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీల విషయానికొస్తే.. మార్చి 7న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా మార్చి 9 నుండి 11 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరించారు. ఇవాళ.. అంటేమార్చి 12న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా.. మార్చి 14 న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదిగా ప్రకటించారు. మార్చి 21న ఎన్నికల పోలింగ్ జరగనుండగా మార్చి 24న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..