ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అధికారిక బృందం ఈ నెల 23 నుంచి 27 వరకు అమెరికాలో పర్యటించనుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పలు కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు శనివారం అమెరికా వెళ్లనున్నారు.
ప్రధానంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సంయుక్తంగా నిర్వహించే సదస్సులో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు’ అన్న అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ నెల 25న తెల్లవారుజామున 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది.
ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి శాయిప్రసాద్, సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ మరో ఐదుగురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు.
ఈ పర్యటనలో.. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, వాణిజ్య వేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు.
న్యూజెర్సీలో టీడీపీ బహిరంగ సభ
ఈ నెల 23న తెలుగుదేశం పార్టీ ప్రవాసాంధ్రులతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్నెస్ కేంద్రంలో ఈ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. నాలుగున్నరేళ్ల పాలనలో సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు, అమలుచేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలను వివరిస్తారు. అలాగే 2019 ఎన్నికలపై పార్టీ శ్రేణులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.