అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి రద్దుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చురుకుగా పావులు కదుపుతున్నారు. నేటి ఉదయం శాసనమండలి రద్దు తీర్మానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మండలి రద్దు తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్ శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే మండలి రద్దు విషయం అంత తేలిక కాదని టీడీపీ ఎమ్మెల్సీ, మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. మండలి రద్దు చేయాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం పొందగలుగుతారని యనమల అన్నారు. స్పీకర్‌గా, మంత్రిగా చేసిన అనుభవం ఉన్న కావడంతో యనమల వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కాగా, శాసనమండలిని రద్దు చేసే ప్రత్యేక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మండలి రద్దు ప్రతిపాదన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్‌కు పంపిస్తారని, అప్పుడు కేంద్ర కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలపాలన్నారు. అనంతరం పార్లమెంట్ ఉభయసభలు లోక్‌సభ, రాజ్యసభకు తీర్మానం వెళ్లగా అక్కడ కూడా ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. చివరగా రాష్ట్రపతి వద్దకు వెళ్లగా ఆయన ఆమోదముద్ర వేసిన తర్వాత మాత్రమే శాసనమండలి రద్దు అవుతుందని యనమల రామకృష్ణుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
కేంద్రం వద్ద ఇదివరకే చాలా ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని ఈ సందర్భంగా యనమల గుర్తుచేశారు. గత చరిత్రను పరిశీలిస్తే ఎంత కాదనుకున్నా.. మండలి రద్దు అంశం తేలడానికి కనీసం రెండేళ్ల వరకు సమయం పడుతుందని వ్యాఖ్యానించారు. చివరికి రాష్ట్రపతి 14రోజుల గడువుతో నోటీసు ఇచ్చిన అనంతరం మండలి రద్దు ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయం (1984)లో కేంద్రానికి ప్రతిపాదన పంపగా ప్రధాని ఇందిరాగాంధీ సహకరించలేదు. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక అంగీకారం తెలపడంతో మండలి రద్దయిన విషయం తెలిసిందే.