Gautam Adani: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బడా వ్యాపారవేత్త అదానీ ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. కొన్ని రోజులుగా రాజకీయాలు ఆయన చుట్టే తిరుగుతున్నాయి. తాజాగా అదానీ గ్రూప్ చేసిన ప్రకటన ఏపీలో రాజకీయ రచ్చ రాజేసింది. అదానీ ప్రకటనను అస్త్రంగా చేసుకుని సీఎం జగన్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అటు వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఈ రచ్చకు ప్రధాన కారణం రాజ్యసభ సీటు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా ఎవరూ ఉంటారన్న వాదనే తాజా రగడకు కేంద్రంగా నిలిచింది.
ఏపీ నుంచి రాజ్యసభకు వైసీపీ అభ్యర్థిగా అదానీ ఫ్యామిలీ నుంచి ఒకరు ఎన్నిక కాబోతున్నారని కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న గౌతమ్ అదానీ కాని లేదంటే ఆయన సతీమణి ప్రీతి అదానీని కాని పెద్దల సభకు పంపించాలని జగన్ నిర్ణయించారనే ప్రచారం జరిగింది. బీజేపీ పెద్దలు కూడా అదానీ విషయంలో జగన్ తో మాట్లాడారనే టాక్ వచ్చింది. గతసారి బీజేపీ కోటాలోనే ముకేష్ అంబానీ స్నేహితుడు పరిమళ్ నత్వానిని రాజ్యసభకు పంపింది వైసీపీ. ఈసారి కూడా అదానీ ఫ్యామిలికి బెర్త్ ఖాయమని అంతా భావించారు. కాని రాజ్యసభ సీటుపై జరుగుతున్న ప్రచారంపై అదానీ గ్రూప్ స్పందించింది. తాము ఏ రాజకీయ పార్టీలో చేరాలని చేరి పదవులు పొందాలని అనుకోవడం లేదని గౌతమీ అదానీ ప్రకటన చేశారు. తమ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని కూడా ఆయన ఆరోపించారు. తాను కాని తన భార్య కాని ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
రాజ్యసభ సీటు విషయంలో గౌతమ్ అదానీ చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. అదానీ ప్రకటనను ఆయుధంగా చేసుకుని వైసీపీపై విమర్శలు చేస్తోంది టీడీపీ. జగన్ రెడ్డికి భయపడే.. ఆయన ఆఫర్ ను అదానీ తిరస్కరించారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. గతంలో పరిమళ నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడు వైసీపీలో చేరాలని ఆయనకు జగన్ షరతు పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ సభ్యత్వం తీసుకున్నాకే నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చారని తెలిపారు. ఈ సారి కూడా రాజ్యసభ స్థానం ఇవ్వాలంటే వైసీపీలో చేరాలని అదానీకి కండీషన్ పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే వైసీపీలో చేరడం ఇష్టం లేకే అదానీ.. పెద్దల సభ ఆఫర్ ను తిరస్కరించారని తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, వరుసగా జరుగుతున్న ఘటనలతో రాష్ట్రం పరువు పోతుందని టీడీపీ చెబుతోంది. అందుకే వైసీపీలో చేరడానికి అదానీ ఫ్యామిలీ భయపడిందని అంటున్నారు. వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభ సీటు తీసుకుంటే.. గ్రూప్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందనే ఆందోళన అదానీ ఫ్యామిలీలో వచ్చిందంటున్నారు.
మరోవైపు వైసీపీ కూడా అదానీ విషయంలో క్లారిటీ ఇస్తోంది. అదానీకి రాజ్యసభ సీటును సీఎం జగన్ ఆఫర్ చేయలేదని... అదంతా మీడియా చేసిన ప్రచారమేనని తెలిపింది. జగన్ ను బద్నాం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యసభ సీటు ఇస్తున్నప్పుడు... పార్టీలో చేరాలని కోరడం తప్పేమి కాదని కూడా కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా రాజ్యసభ సీటు తమకు వద్దంటూ గౌతమి అదానీ చేసిన ప్రకటన ఏపీలో రాజకీయ మంటలు రేపుతోంది.
READ ALSO: Assam Floods: అస్సోం వరదల్లో చిక్కుకున్న రెండు రైళ్లు, 14 వందల మంది ప్రయాణీకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook