తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ కడప ఉక్కు కర్మాగారానికి పునాది పడే వరకూ గడ్డం తీయనని శపథం చేశారు. సోమవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్‌కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఘన పదార్థాలను తీసుకోవడం లేదనీ, కేవలం ద్రవ రూపంలో మాత్రమే ఆహారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు పునాది పడే వరకూ గడ్డం తీయనని ఆయనీ సందర్భంగా తెలిపారు. రేపు అనంతపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని సీఎం రమేష్ చెప్పారు.