Weather updates | విశాఖ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరో 24 గంటల్లో ఆ అల్పపీడనం మరింత బలపడనున్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్ప పీడనం ప్రభావంతో జూన్ 10 నుంచి 12 వరకు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ( heavy rain), రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు ( Lightning) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఒడిషా, కోస్తాంధ్ర, తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని విధర్భ ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ అల్ప పీడనం ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. ఛత్తీస్ఘడ్, దక్షిణ మధ్య ప్రదేశ్లో జూన్ 11 నుంచి 13 వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కోస్తా తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని విశాఖ తుపాన్ హెచ్చరికలు కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.
నైరుతి రుతుపవనాలతోనూ వర్షాలు:
అల్ప పీడనం ( Low pressure) పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాయలసీమలో పూర్తిగా వ్యాపిస్తున్నాయి. ఇవాళ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలను తాకనున్నాయని... ఒకటి రెండు రోజుల్లో తెలంగాణను కూడా చేరుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.