Union Budget 2025: కేంద్ర బడ్జెట్ లో కేంద్రం సామాన్యులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయోనని వేచి చూస్తున్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల కోసం కేటాయింపులు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. 'వికసిత్ భారత్' నినాదంతో ముందుకెళ్లుతున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు అనుగుణంగానే పలు సంస్కరణలు, పథకాల కొనసాగింపు, కొత్త నిర్ణయాలు, దిద్దుబాటు చర్యలను బడ్జెట్లో తీసుకోనుందని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో ఆర్థిక మంత్రిగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్.. ఏయే వర్గాలకు ఊరట కలిగించనున్నారో? ఎవరిపై భారం మోపనున్నారో అనే ఆందోళనలు ఉన్నాయి. కార్పొరేట్ దిగ్గజాల నుంచి సగటు మధ్య తరగతి పౌరుడి వరకు ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో బడ్జెట్‌పై అంచనాలు కూడా పెరిగిపోయాయి.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతుండటం ఆందోళనకర అంశం. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి రాకపోవడం, వృద్ధి రేటు అంచనాలకు మించి క్షీణించడంతో అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019లో నిర్మలా సీతారామన్ తొలి సారిగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పారిశ్రామిక రంగానికి సంబంధించిన పన్నుల్లో సంస్కరణలు తీసుకొని వచ్చారు. కార్పొరేట్ పన్నులను తగ్గించడంతో.. ఆయా సంస్థలు పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడే పరిస్థితి వచ్చింది. అయితే కార్పొరేట్ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేలా ఈ నిర్ణయం అనుకూలించినా.. కొత్తగా ఉద్యోగాలు రాకపోవడం మైనస్‌గా మారింది.
నిర్మలా సీతారామన్ 2020లో ఆదాయపు పన్ను విషయంలో పలు సంస్కరణలు తీసుకొని వచ్చారు. దీనిలో భాగంగా రెండు అదనపు స్లాబ్‌లతో పాటు ఐదు కొత్త ప్రధాన స్లాబ్‌లను ప్రవేశపెట్టారు. 0%, 5%, 12%, 18% మరియు 28% స్లాబ్‌లతో పాటు అదనంగా 3 %, 0.25% స్లాబ్‌లు వచ్చి చేరాయి. ఈ స్లాబ్స్ వల్ల హేతుబద్దీకరణ జరిగి, వేతన జీవులకు ఊరట కలుగుతుందని కేంద్రం చెప్పింది.
కానీ ఇవి మరింత జఠిలంగా తయారు కావడంతో.. స్లాబ్స్ తగ్గించాలని కార్పొరేట్లు కోరుతున్నాయి. మూడు స్లాబ్లకు వీటిని కుదించాలని చెబుతున్నాయి. మరోవైపు కొత్త స్లాబును చేర్చి ఆదాయ పన్ను మినహాయింపును రూ. 10 లక్షలకు పెంచుతారనే టాక్ నడుస్తున్నది. కాంపన్సేషన్ సెస్ గడువు మార్చి 2026లో ముగియనుండడంతో వ్యాపారాలు, వినియోగదారులు పన్ను భారాన్ని తగ్గించడానికి, దేశీయ తయారీని ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా దృష్టిలో పెట్టుకొని స్లాబ్ రేట్లను హేతుబద్దీకరించాలని కోరుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన వంటి పథకాలకు బడ్జెట్ కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ పథకాలకు తోడుగా మరికొన్ని కొత్త పథకాలు ఏమైనా ప్రవేశపెడతారనే ఆసక్తి నెలకొంది. దేశంలో దాదాపు 12 కోట్ల మంది పేద కుటుంబాలకు ఆరోగ్య భీమా కల్పించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్‌ను 2018లో ప్రవేశపెట్టారు. అయితే కరోనా తర్వాత సమయంలో లబ్దిదారుల సంఖ్య 50 కోట్లకు చేరుకుంది. తాజాగా బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇప్పటి వరకు 3 కోట్ల మంది గ్రామీణ పేదలకు సొంతిళ్లు నిర్మించారు. రెండో దశలో పట్టణ ప్రాంతాల్లో కూడా కోటి మంది పేదలు, మధ్య తరగతి వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పింది. దీనికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారో చూడాలి.
ముద్రా యోజన ద్వారా చిన్న, మధ్య స్థాయి పారిశ్రామికవేత్తల కోసం హామీ లేని రుణాలను అందించేందుకు ముద్ర యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. శిశు, కిశోర్, తరుణ్ విభాగాలుగా రుణాలు అందిస్తున్నారు. గతంలో తరుణ్ కింద రూ. 10 లక్షల లోన్ ఇచ్చేవారు. కానీ ఇటీవల రూ. 20 లక్షలకు పెంచారు. మిగిలిన రెండు విభాగాల్లో కూడా లోన్ అమౌంట్ పెంచుతారేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు. సౌర విద్యుత్ వాడకాన్ని ప్రొత్సహించడానికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 3 కిలోవాట్లకు 78 వేల రాయతీ ఇస్తుండగా.. దీన్ని మరింతగా పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ సారి బడ్జెట్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను 2028 వరకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి కూడా భారీగా కేటాయింపులు ఉండబోతున్నాయనే అంచనాలు ఉన్నాయి. ప్రతీ రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో 2018లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టారు. ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్నారు. తాజా బడ్జెట్లో దీనికి కూడా కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. కాగా, మోడీ ఇప్పటికే వేతన జీవులకు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగిస్తామని వాగ్దానం చేశారు. శుక్రవారం జరిగిన పార్లమెంట్ సెషన్లో ఈ మేరకు బడ్జెట్‌పై హింట్ ఇచ్చారు. దీంతో ధరల నియంత్రణ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంపద, శ్రేయస్సు ఇవ్వాలని తాను లక్ష్మీదేవిని తలవంచి వేడుకుంటున్నానని చెప్పడం విశేషం. వికసిత్ భారత్ సాధించే లక్ష్యంతో దూసుకొని వెళ్తున్న దేశానికి ఈ బడ్జెట్ సరికొత్త బలాన్ని, ఆశను ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి కటాక్షం కొనసాగాలని ఆయన బలంగా కోరారు. భారత్ గణతంత్ర దేశంగా 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం మన దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నా మూడో టర్మ్‌లో ఇది మొదటి పూర్తి స్థాయి బడ్జెట్. 2047లో భారత్ 100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి తప్పకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటామని మోడీ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.