ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్ర తీర ప్రాంతంలో ముంచుకొస్తున్న ఫొని తుపాన్ తీవ్రతపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కేబినెట్ సెక్రటరీ, ఐఎండీ, ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖలకు చెందిన ఉన్నాధికారులు పాల్గొన్నారు. తుఫాను తీవ్రత, దాని వల్ల జరిగే నష్టం తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. తుపాను ప్రభావం ఏపీ, ఒడిషాతో పాటు మొత్తం ఆరు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సహాయక చర్యల్లో కేంద్ర బలగాలు
ఈ సందర్భంగా ముందస్తు చర్యలపై ప్రధాని మోడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైన చోట కేంద్ర బలగాల మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు.
పునరావాస ఏర్పాట్లపై ఆరా..
తుపాన్ ప్రభావిత రాష్ట్రాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఆరు రాష్ట్రాల్లో అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇదే సందర్భంలో తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు తాగునీరు, విద్యుత్, టెలికాం పునరుద్ధరణ పనుల్లో ఎన్డీఆర్ఎఫ్, సైనికుల సాయం అందించాలని సూచించారు.