దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు సికింద్రాబాద్ రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్–కాకినాడ మధ్య 4 సువిధ ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపనుంది.
ప్రత్యేక రైళ్ల వివరాలు:
- హైదరాబాద్–కాకినాడ టౌన్ సువిధ స్పెషల్ (82709): అక్టోబర్ 18, 20 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.20కు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
- కాకినాడ టౌన్-హైదరాబాద్ సువిధ స్పెషల్ (82710): అక్టోబర్ 19, 21 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.50కు హైదరాబాద్‌కు చేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా కాకినాడ చేరుకుంటుంది.
- సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ (07256): అక్టోబర్ 17న రాత్రి 7.20గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6గంటలకు నర్సాపూర్ చేరుతుంది.
- కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (07002): అక్టోబర్ 17న ఉదయం 5గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరి అదే రోజు సాయంత్రం 6గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
- బెంగళూరు–విశాఖపట్నం ప్రత్యేక రైలు (06579): అక్టోబర్ 12, 19, 26, నవంబర్ 2, 9వ తేదీల్లో సాయంత్రం 6.35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది
- విశాఖపట్నం–బెంగళూరు రైలు (06580): అక్టోబర్ 14, 21, 28, నవంబర్ 4, 11 తేదీల్లో మధ్యాహ్నాం 1.45కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు యశ్వంతపూర్‌కు చేరుకుంటుంది.
పండుగకి రైళ్లనీ ఫుల్..
దసరా, దీపావళి పండుగలకు హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణీకులకు ఈసారి కూడా రవాణా ఇబ్బందులు తప్పేలా లేవు. సెలవులు, రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించకపోవడంతో రెగ్యులర్ రైళ్లలో ఇప్పటికే వెయిటింగ్ లిస్టు వందల్లోకి వెళ్లింది. దీంతో ప్రజలు ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రత్యేక రైళ్లను నడపాలని, కనీసం రెగ్యులర్ రైళ్ల బోగీలను పెంచాలని ప్రయాణీకులు సూచిస్తున్నారు.
అటు తెలంగాణ ఆర్టీసీ దసరా సెలవుల సందర్భంగా 4 వేలకు పైగా ప్రత్యేక బస్సులను ప్రకటించింది. తెలంగాణలోని అన్ని పట్టణాలు, పల్లెలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ముఖ్య పట్టణాలు, కర్ణాటకలోని బీదర్, యాద్గిర్, బెంగుళూరు, మైసూరు వంటి ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు అందించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులు అక్టోబర్ 8వ తేదీ నుంచి 18 వరకు నడుస్తాయని పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ద్వారా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉందన్నారు.