‘నీడలేని ఆడది’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన నటుడు వంకాయల సత్యానారాయణ ఈ రోజు విశాఖపట్నంలో కన్నుమూశారు. సీతామహాలక్ష్మి, ఊరికిచ్చిన మాట, అర్థాంగి, శుభలేఖ, విజేత లాంటి చిత్రాల్లో వంకాయల నటించారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఈ రోజు మరణించిన విషయం తెలియగానే.. సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
వంకాయల అసలు పేరు వంకాయల సత్యనారాయణ మూర్తి. దాదాపు 180 చిత్రాల్లో ఆయన సహాయనటుడిగా నటించారు. క్యారక్టర్ ఆర్టిస్ట్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. 1940 డిసెంబరు 28వ తేదిన విశాఖలోని చవల వీధిలో జన్మించిన వంకాయల తొలినాళ్లలో సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత టీవీ సీరియల్స్ లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
హిందుస్థాన్ షిప్‌యార్డులో జాబ్ వచ్చినా.. ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన వంకాయల.. నటన మీద ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగుతో పాటు పలు తమిళ, హిందీ చిత్రాలలో కూడా నటించిన వంకాయల.. వైజాగ్‌లో "వంకాయల జ్యూయలర్స్" పేరుతో ఓ బంగారు షాపును కూడా నడిపేవారు.