భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- అధికారంలోకి వచ్చే తదుపరి ప్రభుత్వం కాషాయ పార్టీ' అని అన్నారు. మార్చి 4 నుండి బీజేపీ ప్రభుత్వం 7వ పే కమిషన్ను అమలు చేస్తుందని చెప్పారు. "రాష్ట్రంలో సీపీఎం పార్టీని మార్చేయండి. 2018 మార్చి 4 నుండి బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 7వ పే కమిషన్ అమలు చేస్తుందని నేను హామీ ఇస్తున్నాను" అని మీడియా సమావేశంలో షా చెప్పారు. 25 ఏళ్ళ సీపీఎం ప్రభుత్వంలో, నిరుద్యోగ యువకుల సంఖ్య 25,000 నుండి 7.33 లక్షలకు పెరిగిందన్నారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కళాశాలను స్థాపిస్తామని షా హామీ ఇచ్చారు. " త్రిపురలో నర్సరీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు బాలికలకు ఉచిత విద్యను అందిస్తాము" అని అమిత్ షా అన్నారు. కాగా, బీజేపీ 60 అసెంబ్లీ స్థానాల్లో 51 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్టి) తొమ్మిది సీట్లలో పోటీ చేస్తోంది. త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఫలితాలు ప్రకటించనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 60 సీట్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. కాని వారిలో ఒకరు తరువాత తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. త్రిపురలో 24 నియోజకవర్గాలలో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ (తృణముల్ కాంగ్రెస్-టీఎంసీ) అభ్యర్థులను నిలబెట్టింది.