వచ్చే ఏడాది మే మాసంలో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ముందస్తుగా జరపాలని నిర్ణయించినప్పుడు ఈ ఏడాది చివరి దాకా ఆగకుండా అక్టోబరులోనే ఎన్నికలు నిర్వహించడం మంచిదని బీజేపీలోని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారని సమాచారం. జులై 18 నుంచి ఆగస్టు 10 వరకు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. అవి ముగిసిన వెంటనే 2019 సార్వత్రిక ఎన్నికలు నిర్వహణపై కేంద్రం ఓ నిర్ణయానికి రానుంది. ఆగస్టులో మోదీ సర్కార్ దీనిపై నిర్ణయం తీసుకుంటే.. భారత ఎన్నికల సంఘం సెప్టెంబరులోనే ఎన్నికల షెడ్యూలు, ఆ తరువాత నోటిఫికేషన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
10 నెలల ముందుముందస్తు ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆయా రాష్ట్రాల అభిప్రాయం కోరవచ్చునని, రాష్ట్రాలు తిరస్కరిస్తే చేసేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.
కాగా గురువారం ఉత్తరప్రదేశ్‌లోని భక్త కబీర్ మహానిర్వాణ స్థలం మగ్‌హర్ నుంచి మోదీ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. మగ్‌హర్‌లో ఆయన ఓ భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. 2019 ఎన్నికలకు ఇక్కడి నుంచే ఆయన ప్రారంభిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఓటింగ్‌లో పారదర్శకత పెంచడానికి పెద్ద ఎత్తున వీపాట్ మెషీన్లను వెంటనే ప్రతి నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాలకు పంపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వచ్చే రెండు నెలల్లోగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకూ మెషీన్లను పంపి అవి ఎలా పనిచేస్తాయో ప్రజలకు అవగాహన కల్పించాలని ఈసీ నిర్ణయించింది.