న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్‌ని గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి, టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల్లో తమ కూటమికి అధిక మెజారిటీ వస్తే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఒకవేళ రానిపక్షంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే అంశాలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అనంతరం చంద్రబాబు వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి వంటి ఇతర జాతీయ స్థాయి కీలక నేతలతోనూ సమావేశమయ్యారు. అంతకన్నా ముందుగా శనివారం సైతం ఢిల్లీలో లోక్ తంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, లక్నోలో మాయావతి వంటి వారితో చంద్రబాబు భేటీ అయ్యారు. అవసరం అయితే, ఎన్డీఏతో కలిసి రాని పార్టీలన్నింటిని కాంగ్రెస్ పార్టీతో కలుపుకుని వెళ్లి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా మోదీ సర్కార్‌ని గద్దె దించొచ్చనే వ్యూహంలో చంద్రబాబు ఉన్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.