పగలు పోలీస్ హోంగార్డుగా సేవలందిస్తూనే.. రాత్రిళ్లు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఆ దొంగతనాలు చేయడం కోసం హిజ్రా వేషం వేసుకొని పెద్దగా జన సంచారం లేని ప్రాంతాలను ఎంచుకోవడం ఆయన నైజం. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరి కడలూరు జిల్లాలో ఈ నెల 25వ తేదిన ఓ వ్యక్తిని అర్థరాత్రి వేళ ఇద్దరు వ్యక్తులు అటకాయించి.. అతని చరవాణిని అపహరించారు. ఆ తర్వాత అవే మాదిరి ఘటనలు ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో కూడా జరిగాయి. అయితే అర్థరాత్రి పూట చోరికి పాల్పడుతున్న ఈ దొంగలను పట్టుకోవడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేసిన పోలీసులు.. ఈ కేసును చాలా ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు.
కాకపోతే అందరి కళ్లు కప్పి జనావాసాల్లో తిరుగుతున్న బ్లాక్ షీప్ తమ డిపార్ట్ మెంటుకి చెందిన వ్యక్తే అని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. హోంగార్డుగా సేవలందిస్తూనే.. రాత్రిళ్లు హిజ్రా వేషం వేసుకొని స్నేహితుడితో కలిసి దొంగతనాలు చేయడానికి సిద్ధమయ్యే భరత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
గత రెండు సంవత్సరాలుగా తాను హిజ్రా వేషం వేసుకొని నేరాలకు పాల్పడుతున్నట్లు ఎంక్వయరీలో భరత్ అంగీకరించాడు. తాను హోంగార్డును కాబట్టి ఎవరికీ అనుమానం రాదని.. అందుకే రాత్రిళ్లు పలు దాడులు చేస్తూ పర్సులు, మొబైల్ ఫోన్లు అపహరించడం పనిగా పెట్టుకున్నామని భరత్ తెలిపారు. భరత్ విషయం తెలుసుకున్న పోలీస్ డిపార్ట్ మెంట్ అతన్ని విధుల నుండి తొలిగించింది. ప్రస్తుతం ఈ కేసును పుదుచ్చేరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భరత్ ఒక్కడే ఈ నేరాలకు పాల్పడుతున్నాడా... లేదా అతని వెనుక ఏదైనా హస్తం ఉందా అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
హిజ్రా వేషంలో చోరీలు చేస్తున్న హోంగార్డు