కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018: ఓటు హక్కును వినియోగించుకుంటున్న రాజకీయ ప్రముఖులు

షికర్పూర్‌లో (షిమోగా జిల్లాలోని ఒక పట్టణం) బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యురప్ప, పుత్తూర్‌లో కేంద్ర మంత్రి సదానంద గౌడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Last Updated : May 12, 2018, 12:54 PM IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018: ఓటు హక్కును వినియోగించుకుంటున్న రాజకీయ ప్రముఖులు

కర్ణాటక ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 222 స్థానాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. జయనగర్ బీజేపీ అభ్యర్థి విజయకుమార్‌ హఠాన్మరణంతో ఆ ఎన్నిక రద్దయ్యింది. నకిలీ ఓటు కార్డులు వెలుగుచూసిన రాజరాజేశ్వరి నగర నియోజకవర్గ ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. సుమారు ఐదుకోట్ల మంది ఓటర్లు తన ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎంత క్యూ ఉందో తెలుసుకునే మొబైల్‌ యాప్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. ఓట్ల లెక్కింపు 15వ తేదీని నిర్వహించి ఫలితాన్ని వెల్లడించనున్నారు.

షికర్పూర్‌లో (షిమోగా జిల్లాలోని ఒక పట్టణం) బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యురప్ప, పుత్తూర్‌లో కేంద్ర మంత్రి సదానంద గౌడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.   

50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప అన్నారు. షిమోగాలోని ఆంజనేయస్వామి ఆలయంలో యడ్యూరప్ప పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 'ఇది ఒక శుభ దినం. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. మాకు (బీజేపీ)150కు పైగా సీట్లు వస్తాయి. మే 17న నేను ప్రభుత్వాన్ని చేయబోతున్నాను' అని అన్నారు. ఈ నెల 17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని, ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను ఆహ్వానిస్తానన్నారు. 'సిద్ధరామయ్య ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. బయటికి వచ్చి ఓటు వేయండని ప్రజలకు పిలుపునిచ్చాను. నేను మంచి పాలన ఇస్తానని కర్ణాటక ప్రజలు విశ్వసిస్తున్నారు' అని అన్నారు.

 

 

 

 

 

'కచ్చితంగా ఈసారి ఓటింగ్ పెరగవచ్చు. కర్ణాటకలో ప్రజలు సిద్దరామయ్య  ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని చూస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి వస్తారు' అని పుత్తూర్‌లో సదానంద గౌడ అన్నారు.  

 

హసన్ జిల్లాలో మాజీ ప్రధాని, జేడీఎస్ (జనతాదళ్ సెక్యులర్) పార్టీ అధినేత హెచ్.డీ.దేవెగౌడ సతీసమేతంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. హసన్‌లోని హోలేనరసిపుర టౌన్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 244లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం దేవెగౌడ మాట్లాడుతూ, 'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల అవకాశం ఉందని మేము అంచనా వేస్తున్నాం, మేము బాగా చేశాము' అని అన్నారు.

 

 

Trending News