రాజస్థాన్లో రెండు రోజులపాటు నిర్వహించిన కానిస్టేబుళ్ల పరీక్ష కోసం అధికారులు రాష్ట్రమంతా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఆన్లైన్ ద్వారా హైటెక్ మోసాలకు పాల్పడవచ్చనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆన్లైన్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలను నిర్వహించారు. అయితే హైటెక్ సాంకేతికతను ఉపయోగించి అభ్యర్ధులకు సహాయపడుతున్న ముఠాను పోలీసులు పట్టుకోవడంతో ఆ పరీక్షలను రద్దు చేశారు.
దీంతో రెండోసారి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలను నిర్వహించింది రాజస్థాన్ ప్రభుత్వం. దాదాపు 13,000 కానిస్టేబుల్ పోస్టులకు 15లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ రికార్డు చేశారు. క్రితంసారి మాదిరి మళ్లీ అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈసారి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. శని, ఆది వారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు ఆపేశారు.
ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఆన్లైన్ లావాదేవీలు, కమ్యూనికేషన్ నెట్వర్క్స్పై ప్రభావం తీవ్రంగా పడింది. ఇంటర్నెట్ జామర్లు పెడితే అయిపోయేదానికి పూర్తిగా సేవలను నిలిపివేయాలా? అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. తొలిసారిగా పరీక్షల్లో చీటింగ్ను అరికట్టేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారని ఓ అధికారి తెలిపారు.
కానిస్టేబుల్ పరీక్ష రెండు రోజులపాటు నిర్వహించామని, ఆదివారం రోజున 7 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని అడిషనల్ డీజీపీ చెప్పారు. కొంతమంది అభ్యర్థుల పేరు మీద ఇతరులు పరీక్ష రాయడానికి వచ్చారని, వారిని పట్టుకున్నట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన చెప్పారు.