ఛత్తీస్‌ఘడ్ ప్రాంతంలో 33 సంవత్సరాల మహ్మద్ ఇబ్రహీం సిద్ధిఖీ.. 23 సంవత్సరాల అంజలి జైన్ అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరూ తమ తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోవాలని భావించారు. అయితే మతాలు వేరు కావడంతో ఇరు వర్గాలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో సిద్ధిఖీ మతంతో పాటు పేరు కూడా మార్చుకున్నాడు. ఆర్యన్ ఆర్యగా పేరు మార్చుకొని.. పెద్దల ప్రమేయం లేకుండా ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అలాగే తనను హిందువుగా పరిగణించాలని తన భార్య కుటుంబ సభ్యులను కోరాడు. అయితే వారు ఒప్పుకోలేదు.
ఈ క్రమంలో తాను హిందూ మతంలోకి మారాడు కాబట్టి.. తనను హిందువుగానే తన భార్య కుటుంబీకులు ఒప్పుకొనేలా చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేశాడు. అయితే కోర్టు ఆయన అభ్యర్థనను కొట్టివేసింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. పైగా అమ్మాయి తల్లిదండ్రులతో లేదా హాస్టలులో కొన్నాళ్లు ఉండాలని తెలిపింది. ఆర్యన్ ఆ ఆదేశాలను సవాలు చేస్తూ.. మళ్లీ తనకు న్యాయం చేయవలసిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన భార్య తనవద్ద ఎందుకు ఉండకూడదో తెలియజేయాలని ఆయన కోరారు. తాను తన భార్యను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నా ఆమె కుటుంబీకులు అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అందుకు పోలీసులు కూడా సహాయం చేస్తున్నారని తెలిపారు.
జస్టిస్ దీపక్ మిశ్రా, డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందించాలని ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే కేసులో హైకోర్టు తీర్పు ఇవ్వకముందు.. న్యాయమూర్తి అంజలి జైన్‌తో మాట్లాడారు. అయితే ఆమె కుటుంబీకుల నుండి తనకు ఎలాంటి హానీ లేదని.. అయితే వారికి మతాంతర వివాహం పట్ల అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలో ఆమెకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని భావించిన కోర్టు.. కొన్నాళ్లు ఆర్యన్ ఆర్య ఆమెను కలవకుండా ఉండాలని.. ఆమె తన ఇష్టప్రకారం తన తల్లిదండ్రుల వద్ద లేదా గర్ల్స్ హాస్టలులో ఉండవచ్చని తెలిపింది. ఇదే తీర్పును సవాలు చేస్తూ ఆర్యన్ ఆర్య సుప్రీంకోర్టులో పిటీషన్ ఫైల్ చేశారు.