బీహార్: జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ ఉపాధ్యక్షుడిగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూ చీఫ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నియమించారు. ప్రశాంత్ కిషోర్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జేడీయూ పార్టీలో చేరిన సంగతి విదితమే. తాజాగా ఇవాళ ప్రశాంత్ కిషోర్ జేడీయూ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రశాంత్ కిషోర్ నియామకంపై పలువురు ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా ప్రశాంత్ కిశోర్ 2014 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. పంజాబ్, యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికలకు వ్యూహరచన చేశారు. ఏపీలోనూ ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్ కోసం పనిచేస్తోంది.
తాను ఎన్నికల వ్యూహకర్తగా ఉండాలనుకోవడం లేదని చెప్పిన ప్రశాంత్ కిశోర్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు ఇటీవలే చెప్పారు. ఆతర్వాత ఆయనకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా.. ఆయన జేడీయూలో చేరారు. అయితే నితీశ్‌కు ప్రశాంత్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆయన జేడీయూలో చేరినట్లు కొంతమంది చెబుతున్నారు. ప్రశాంత్ కిశోర్ చేరిక వల్ల తమ పార్టీ అన్ని వర్గాలకు చేరువవుతుందని జేడీయూ పార్టీ భావిస్తోంది.
రానున్న 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు జేడీయూ పార్టీకి ఏ మేరకు పనిచేస్తాయో వేచిచూడాల్సిందే.. !