పుదుచ్చేరి గ్రామాల్లో బహిరంగ మల విసర్జనపై లెఫ్టినెంట్ గవర్నర్ ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో ఆమె కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి గ్రామాల్లో ఉచిత బియ్యం పంపిణీని నిలిపివేశారు. గ్రామాల్లో ప్రతి ఇంటిలోనూ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయితేనే ఉచిత బియ్యం పథకం అమలు చేస్తామని ఆమె అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరగడం పట్ల గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ విసర్జన జరగడం లేదనీ.. పూర్తి స్వచ్ఛత పాటిస్తున్నారని స్థానిక అధికార యంత్రాంగం సర్టిఫికెట్ ఇచ్చిన గ్రామాలకు మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ఆమె ట్విటర్లో పేర్కొన్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో సగం మందికి పైగా ఉచిత బియ్యం ఇస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. ఎక్కడపడితే అక్కడ చెత్తపడవేయడం, ప్లాస్టిక్ వాడకానికి, బహిరంగ విసర్జనకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.
Linked Free Rice distribution to respective constituency MLAs & Commune Commisioners Certifying villages open defecation free and of strewn garbage and plastic.
Free Rice reaches out to more than half d population primarily in rural areas
This is d learning of morning round today pic.twitter.com/CCIaVAGdDT
— Kiran Bedi (@thekiranbedi) April 28, 2018
కాగా పుదుచ్చేరి గ్రామాలను స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఆమె నిర్ణయం బాగుంటుందని కొందరు నెటిజన్లు చెప్పగా.. అది చాలా కష్టమంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ‘‘ఈ రెండిటికీ ముడిపెట్టడం తెలివైన విషయం ఏమీ కాదు. పరిశుభ్రత, ఆకలి రెండూ ఒకే ఒరలో ఉండలేవు’’ అని ఓ నెటిజన్ పేర్కొనగా.. ‘‘బియ్యమే కొనుక్కోలేని వాళ్లు టాయిలెట్లు నిర్మించుకోగలరా?' అంటూ మరొకరు ప్రశ్నించారు.