ఇస్లామ్లోని షియా సంప్రదాయానికి చెందిన కమ్యూనిటీ దావూదీ బోహ్రా సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అషారకా ముబారకా కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఇండోర్ ప్రాంతంలోని షైఫీ మసీదులో ఈ సమావేశం జరిగింది. భారతదేశ చరిత్రలో ఓ ప్రధాని ఈ సమావేశానికి హాజరవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ సమావేశానికి హాజరైన మోదీ ప్రసంగిస్తూ.. భారత్ శక్తిమంతమైన రాజ్యంగా ఎదగడానికి ఇలాంటి సంఘాలు ఇస్తున్న చేయూత ఎంతో ఉందని ఆయన తెలిపారు.
ఈ సమావేశానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్తో పాటు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ మొదలైనవారు హాజరయ్యారు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ "నాకు బోహ్రా కమ్యూనిటీతో ఉన్న సంబంధం ఈనాటిది కాదు. అనేక సంవత్సరాల క్రితమే నాకు ఈ కమ్యూనిటీతో సత్సంబంధాలు ఉన్నాయి. నేను వారి కమ్యూనిటీలో కొన్నాళ్లు సభ్యునిగా కూడా ఉన్నాను. వారు గొప్ప సంఘసేవాపరులు. వారి ప్రేమకు నా ద్వారాలు ఎప్పుడూ తెరుచుకొనే ఉంటాయి" అని తెలిపారు.
"నేను గతంలో ఓసారి సయ్యద్నా గారిని ఎయిర్ పోర్టులో కలిసాను. అప్పుడు మా మధ్య చిన్న చర్చ జరిగింది. గుజరాత్లో నీటి సమస్య ఎక్కువగా ఉందని.. చెక్ డ్యాములు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపాను. ఆ తర్వాత సయ్యద్నా గారు తన కమ్యూనిటీ తరఫున గుజరాత్లో పలు ప్రాంతాల్లో చెక్ డ్యాములు నిర్మించడానికి సహాయం చేశారు. అలాగే అనేక చోట్ల నీటి సమస్య తలెత్తకుండా తన కమ్యూనిటీ సహాయంతో ప్రత్యమ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు" అని నరేంద్ర మోదీ ముస్లిం మతగురువు సయ్యద్నా ముఫద్దుల్ సైఫుద్దీన్ పై ప్రశంసలు కురిపించారు. ఇదే కార్యక్రమంలో బోహ్రా కమ్యూనిటీ ముఖ్యులు మోదీని ఘనంగా సత్కరించారు.
Indore: Syedna Mufaddal Saifuddin, spiritual head of the Dawoodi Bohra community felicitates Prime Minister Narendra Modi, at Saifee Mosque pic.twitter.com/FdAUVXlnsC
— ANI (@ANI) September 14, 2018