అవిశ్వాస తీర్మానంపై చర్చ: ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ చురకలు

                             

Last Updated : Jul 20, 2018, 10:16 PM IST
అవిశ్వాస తీర్మానంపై చర్చ: ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ చురకలు

ప్రధాని నరేంద్ర మోదీ తనని ఎదుర్కోలేకపోతున్నారు అని అన్నారు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. పార్లమెంట్‌లో శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ నాయకత్వంలోని కేంద్ర సర్కార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రఫేల్ ఒప్పందంపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అవాస్తవాలు చెబుతున్నారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఏ హామీలైతే ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీలు ఇంకా పూర్తికాలేదు. అభివృద్ధి విషయంలో కేంద్రం చెప్పుకుంటున్న గణాంకాలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి అసలు పొంతనే లేదు. దేశంలో పేరొందిన ధనికుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చేశారు కానీ సామాన్యుల కోసం, మధ్య తరగతి వారి కోసం ఏమైనా చేయాలనే ఆలోచన ఆయనకు లేదు అని మండిపడ్డారు.

గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీల గురించి ప్రస్తావిస్తూ ప్రతీ పౌరుని బ్యాంక్ ఎకౌంట్‌లో రూ. 15 లక్షలు జమ అవుతాయని అన్నారు. ఆ రూ.15 లక్షలు ఏవి ? అలాగే దేశంలో 2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆ 2 కోట్ల ఉద్యోగాలు ఏవి ? దేశంలో యువత మొత్తం ప్రధాని నరేంద్ర మోదీపై ఆశలు పెట్టుకుంది. కానీ కేవలం 4 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది అని రాహుల్ గాంధీ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇంకొన్నిసార్లు పకోడీలు వేసుకోండి లేదా ఏదైనా దుకాణాలు తెరుచుకోండి అని కూడా చెబుతుంటారు అంటూ కేంద్రం వైఖరిని రాహుల్ ఎండగట్టే ప్రయత్నం చేశారు. 
 

Trending News