పలు ప్రభుత్వ విభాగాల్లో తిష్ట వేసిన నిర్లక్ష్యం, లెక్కలేనితనం చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. రాజస్తాన్లోని బర్మెర్లో తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన కూడా అటువంటిదే. బర్మెర్లో ఇద్దరు మహిళల శవాలకు వైద్యులు నియమనిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రిలో కాకుండా ఆస్పత్రి బయట రోడ్డుపైనే బహిరంగంగా పోస్ట్-మార్టం నిర్వహించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. విద్యుదాఘాతానికి గురై చనిపోయిన ఇద్దరు మహిళల శవాలను పోస్ట్ మార్టం నిమిత్తం బర్మెర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు మాత్రం రోడ్డుపైనే శవాలకు పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేయడం విమర్శలకు తావిచ్చింది.
ఇదే ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్ని వివరణ కోరగా.. మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకుని విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్ స్పష్టంచేశారు.