ఇకపై తమిళనాడులో ఐపీఎల్ మ్యాచ్‌‌లు లేనట్టే !

తమిళనాడులో ఇకపై ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడం కష్టమేనని తెలుస్తోంది. 

Last Updated : Apr 12, 2018, 10:00 AM IST
ఇకపై తమిళనాడులో ఐపీఎల్ మ్యాచ్‌‌లు లేనట్టే !

తమిళనాడులో ఇకపై ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడం కష్టమేనని తెలుస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగాల్సి వున్న మ్యాచ్‌లన్నింటినీ ఇకపై తమిళనాడులో కాకుండా మరో చోట నిర్వహించనున్నారు అనే సమాచారం అందుతోంది. అందుకు కారణం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎల్‌కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవడమే. మంగళవారం స్థానిక ఫ్రాంచైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ని సైతం పలు తమిళ ప్రజా సంఘాలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ప్రస్తుతం తమిళనాడులో కావేరి నీటి కోసం తాము పోరాడుతోంటే, ఇక్కడ ఐపీఎల్ నిర్వహణ ఏంటంటూ పలు ప్రజా సంఘాలు చేస్తోన్న నిరసనకు తలొగ్గిన ఐపీఎల్ నిర్వాహకులు.. ఇక చేసేదేం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇకపై తమిళనాడులో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం లేదు అని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. అయితే, చిదంబరం స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లని ఇకపై ఎక్కడ నిర్వహిస్తారు అనే అంశంపైనే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌ని అడ్డుకుంటాం అని తమిళ ప్రజా సంఘాలు హెచ్చరించిన అనంతరం ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా మంగళవారం హోం శాఖ కార్యదర్శిని కలిసి ప్రభుత్వ సహాయం తీసుకునే ప్రయత్నం చేశారు. ఆటగాళ్లు, ఆడియెన్స్‌కి తగిన భద్రత కల్పిస్తామని రాజీవ్ శుక్లాకు హోం శాఖ కార్యదర్శి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మంగళవారం మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం వద్ద దాదాపు 4,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ నుంచి నిషేధానికి గురైన అనంతరం చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్ ఇదే కావడంతో తమిళ ప్రజా సంఘాలు ఈ మ్యాచ్‌ని లక్ష్యంగా చేసుకుని తమ నిరసన వ్యక్తంచేశాయి. ఈ మ్యాచ్‌లో ఫీల్డర్లపై చెప్పులు విసిరి తమ నిరసన తెలిపారు పలువురు ఆందోళకారులు. ఆందోళనకారులు విసిరిన చెప్పుల్లో ఒకదాని నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు రవీంద్ర జడేజా తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడితో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆందోళనకారులని అదుపులోకి తీసుకుని బయటికి తరలించారు. 

Trending News