Who will be Karnataka Next CM: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సంగతి ఎలా ఉన్నా.. ఓటర్ దేవుళ్లు ఇచ్చే అసలు తీర్పు ఎలా ఉండనుంది అనేది తేలేది మాత్రం రేపే. ఒకవేళ బీజేపికి మెజార్టీ వస్తే.. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేసులో ఇద్దరు నాయకులు ఉన్నారు. నాకే ముఖ్యమంత్రి సీటు కావాలి అని ఆశించే వారి సంఖ్య ఇంకాస్త ఎక్కువే ఉంది కానీ అందరికీ ఆ అవకాశం ఉండదు కాబట్టి బీజేపి అధిష్టానం మదిలో ఎంత మంది ఉన్నారనేదే ముఖ్యం.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇక్కడ కూడా మళ్లీ ఇద్దరు నేతలు రేసులో ఉన్నారు. బీజేపీ తరహాలో కాకుండా ఇక్కడ పోటీ ఇద్దరి మధ్యే నెలకొని ఉంది. బీజేపి, కాంగ్రెస్ పార్టీ కాకుండా మరో అవకాశం ఎవరికైనా ఉందా అంటే అది జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికే ఉంది. తక్కువ సీట్లతో కింగ్ మేకర్ అవుతారు కానీ కింగ్ ఎలా అవుతారు అని అనుకోవద్దు. గతంలో జేడీఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని పంచుకున్న సమయంలో ముఖ్యమంత్రి పదవిని కూడా పంచుకున్న సంగతి తెలిసిందే. అందుకే ముఖ్యమంత్రి రేసులో కుమారస్వామి ఉండరు అని అనుకోవడానికి వీల్లేదు. ఇక ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఐదుగురు నాయకులు ఎవరు ? ఎందుకు వాళ్లే కీలకం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సిద్ధరామయ్య :
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలా కాంగ్రెస్ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్యకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిద్ధరామయ్య అసెంబ్లీలో కూడా సీనియర్ నాయకుడు. ఇప్పటికీ ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అతికొద్దిమంది నాయకుల్లో సిద్ధరామయ్య కూడా ఒకరు. పైగా ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కూడా.
డికే శివకుమార్ :
కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్.. యూత్ కాంగ్రెస్ రోజుల్లోంచే కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న నాయకుడు. 1989 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన శివ కుమార్.. ఇప్పటి వరకు మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. పీసీసీ చీఫ్ హోదాలో ఆ క్రెడిట్ లో కొంత వాటా ఉన్న నాయకుడు కూడా అవుతారు.
హెచ్.డి. కుమారస్వామి :
రెండుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న కుమారస్వామి సొంతం. మాజీ ప్రధాని హెచ్.డి. దేవే గౌడ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కుమారస్వామికి జనంలో కుమారన్నగా మంచి పేరుంది.
బి.ఎస్. యెడియూరప్ప :
బి.ఎస్. యెడియూరప్ప.. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం మాత్రమే కాదు.. కర్ణాటకలో అతి పెద్ద ఓటు బ్యాంకు కలిగిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన మాస్ లీడర్ కూడా. ఒకే నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు. అవును.. షిమోగ జిల్లాలోని శికరిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యెడియూరప్ప ఎనిమిదిసార్లు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీలో ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత కూడా యెడియూరప్పనే. కర్ణాటకలో కాంగ్రెస్ ని పక్కకు పెట్టి బీజేపి పుంజుకునేలా చేయడంలో యెడియూరప్ప పాత్ర ఎంతో కీలకం. అధిష్టానానికి సైతం ఈ విషయం తెలుసు.
బసవరాజ్ బొమ్మై :
ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా బీజేపిలో నేమ్ అండే ఫేమ్ ఉన్న నాయకుడే. బొమ్మై తండ్రి ఎస్.ఆర్. బొమ్మై కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన వారే. వాస్తవానికి బసవరాజ్ బొమ్మై తన పొలిటికల్ కెరీర్ని జనతా దళ్ నుంచే మొదలుపెట్టారు. 2008 లో బసవరాజ్ బొమ్మై బీజేపిలో చేరారు. అప్పటి నుంచి షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బొమ్మై ఏకచత్రాధిపత్యం నడుస్తోంది.